పాక్ ని చిత్తు చేసిన భారత్ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, November 30, 2019

పాక్ ని చిత్తు చేసిన భారత్

నూర్‌-సుల్తాన్‌: భారత టెన్నిస్‌ డబుల్స్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌ అరుదైన రికార్డు సృష్టించాడు. డేవిస్‌కప్‌ డబుల్స్‌లో 44వ విజయం అందుకున్నాడు. ప్రపంచ టెన్నిస్‌లో ఈ ఘనత మరెవ్వరికీ లేకపోవడం గమనార్హం. శనివారం జీవన్‌ నెడుంజెళియన్‌తో కలిసి మహ్మద్‌ షోయబ్‌, హఫైజా అబ్దుల్‌ రెహ్మాన్‌తో కూడిన పాక్‌ ద్వయాన్ని 6-1, 6-3 తేడాతో ఓడించాడు. వీరిద్దరూ కేవలం 53 నిమిషాల్లో ఆటను ముగించారు. ఈ విజయంతో పాక్‌పై భారత్‌ 3-0తో ఆధిక్యంలో నిలిచింది.


గతేడాది చైనాతో జరిగిన డేవిస్‌కప్‌ టైలో పేస్‌ 43వ డబుల్స్‌ విజయం అందుకున్నాడు. డేవిస్‌కప్‌ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన ఇటలీ దిగ్గజం నికోలా పీట్రాంజెలిని దాటేశాడు. నికోలా 66 టైల్లో 42 విజయాలు సాధించగా పేస్‌ కేవలం 56 టైల్లోనే 43 గెలిచాడు. తాజాగా 44వ విజయంతో తన రికార్డును మరెవ్వరూ బద్దలు కొట్టకుండా పటిష్ఠం చేసుకున్నాడు. ఎందుకంటే ప్రస్తుత టాప్‌-10 జాబితాలో ఎవరూ అంత చురుకుగా లేరు. బెలారస్‌కు చెందిన మాక్స్‌ మిర్నేయి డేవిస్‌కప్‌లో 36 డబుల్స్‌ విజయాలతో మూడో స్థానంలో ఉన్నప్పటికీ 2018 నుంచి టోర్నీలో పాల్గొనడం లేదు.

Post Top Ad