సంక్రాంతి వరకూ విజయవాడలో 144 సెక్షన్ విధింపు:... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, December 01, 2019

సంక్రాంతి వరకూ విజయవాడలో 144 సెక్షన్ విధింపు:...

విజయవాడ: విజయవాడలో 144 సెక్షన్ ను విధించారు. 144 సెక్షన్ ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. ఏకంగా 46 రోజుల పాటు కొనసాగనుంది. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీ వరకు దీన్ని కొనసాగించనున్నారు. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఏకంగా నెలన్నర రోజుల పాట 144 సెక్షన్ ను అమల్లోకి తీసుకుని రావడం చర్చనీయాంశమౌతోంది.


సాధారణంగా- అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో 144 సెక్షన్ ను విధిస్తుంటారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులూ ఈ ఆంక్షలు కొనసాగుతుంటాయి. ఈ నెల 9వ తేదీ నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆరంభం కానున్నాయి. 21వ తేదీన ముగుస్తాయి. ఈ సమావేశాల సందర్భంగా 144 సెక్షన్ ను విధించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడానికి ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులందరూ ఒకేచోటకి చేరుకోనున్న నేపథ్యంలో.. 144 సెక్షన్ విధించడం ఆనవాయితీ.

ఈ సారి మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించారు పోలీసులు. ఆదివారం నుంచే దీన్ని అమలులోకి తీసుకుని రావడం, జనవరం సంక్రాంతి పండుగ వరకూ కొనసాగించడం వెనుక ఉద్దేశమేమిటనేది తెలియ రావట్లేదు. విజయవాడ నగరంలో శాంతిభద్రతలను పరిరక్షించడానికే 144 సెక్షన్ ను అమల్లోకి తీసుకుని వచ్చినట్లు ద్వారకా తిరుమల రావు చెబుతున్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్న సమయంలో దీనికి భిన్నంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

Post Top Ad