తమిళనాడు లో రాకెట్‌ ప్రయోగ కేంద్రం - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, December 01, 2019

తమిళనాడు లో రాకెట్‌ ప్రయోగ కేంద్రం

చెన్నై : తమిళుల దీర్ఘకాల కల నెరవేరబోతోంది. తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణంలో 2,500 ఎకరాల విస్తీర్ణంలో రాకెట్‌ ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. స్థలసేకరణ పనుల కోసం రెవెన్యూ శాఖ 8 మంది తహ సీల్దార్లను నియమించింది. భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం సుమారు 40 ఏళ్ల క్రితం కన్నియకుమారిలో రాకెట్‌ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. అయితే ప్రజలు అధికంగా నివసిస్తున్న కారణంగా ఈ పథకాన్ని అటకెక్కించారు. శ్రీహరికోటలో ప్రస్తుతం రెండు రాకెట్‌ ప్రయోగ కేంద్రాలు ఉన్న నేపథ్యంలో, దేశాభివృద్ధి, భద్రతను దృష్టిలో ఉంచుకొని అంతరిక్ష రంగంలో మరిన్ని విజయాలు సాధించాలన్న దృక్పఽథంతో కేంద్రప్రభుత్వం మూడవ రాకెట్‌ ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. అంతరిక్ష పరిశోధన కేంద్రానికి చెందిన పలువురు శాస్త్రవేత్తలు శాటిలైట్‌ ద్వారా మూడవ రాకెట్‌ ప్రయోగ కేంద్రం ఏర్పాటుపై పరిశోధనలు చేపట్టారు. అప్పుడు భూమధ్యరేఖకు అతి దగ్గరగా ఉన్న కులశేఖర పట్టణాన్ని ఎంపిక చేశారు.ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించిన మ్యాప్‌ ఆధారంగా రెవెన్యూ శాఖ అధికారులు తూత్తుకుడి జిల్లా ఉడన్‌కుడి యూనియన్‌ పరిధిలోని మాధవన్‌కురిచ్చి, అమరాపురం, కూడల్‌నగర్‌, సాత్తాన్‌కుళం యూనియన్‌ పరిధిలోని పళ్లకురిచ్చి, బడుగపత్తూర్‌ ప్రాంతాల్లో ఉన్న చెట్లు, ఇళ్లు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, ఇతర భవనాలను పరిశీలించి తయారు చేసిన నివేదికను కేంద్రానికి సమర్పించారు. ఇందులో ఒక్క కూడల్‌నగర్‌లో మాత్రమే ఇళ్లు అధికంగా వుండగా, మిగతా ప్రాంతాలు 90 శాతం వరకు ఖాళీ భూములుగానే ఉన్నాయి. ఇందులో కులశేఖర పట్టణంలో 2,500 ఎకరాల విస్తీర్ణం స్థలాన్ని రాకెట్‌ ప్రయోగ కేంద్రానికి ఎంపిక చేసినట్టు తూత్తుకుడి జిల్లా కలెక్టర్‌ సందీప్‌నందూరి పేర్కొన్నారు.

Post Top Ad