పర్యావరణ పరిరక్షణలో అగ్రభాగాన తెలంగాణ :సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ ప్రశంస - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, December 01, 2019

పర్యావరణ పరిరక్షణలో అగ్రభాగాన తెలంగాణ :సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ ప్రశంస


తెలంగాణ పర్యావరణ పరిరక్షణలో అన్ని రాష్ట్రాల కంటే ముందున్నదని కేంద్ర పర్యావరణ, సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ ప్రశంసించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిని మొక్కలను కాపాడుకునేందుకు తెలంగాణా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని జవడేకర్ అభినందించారు. దేశ రాజధాని ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో శనివారం రాష్ట్రాల అటవీ, పర్యావరణ శాఖల మంత్రులతో సమావేశం జరిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, పారిశ్రామిక ప్రాంతాల్లో నాటిన మొక్కలను సంరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని జవడేకర్ కొనియాడారు. తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్. శోభ రాష్ట్రాల అటవీ శాఖల మంత్రుల సమావేశానికి హాజరయ్యారు. అడవుల పరిరక్షణ, ప్రత్యామ్నాయ భూముల్లో అడవులను పెంచటం, కంపా నిధుల వినియోగం, తెలంగాణాకు హరిత కార్యక్రమం ద్వారా అటవీయేతర ప్రాంతాల్లో మొక్కలు నాటకం, నదీ పరీవాహక ప్రాంతాల్లో అడవుల రక్షణ, భూమిలో తేమ శాతాన్ని పరిరక్షించటం, గడ్డి క్షేత్రాల అభివృద్ది స్కూల్ నర్సరీ పథకం ద్వారా మొక్కలు నాటడంలో విద్యార్థులను భాగస్వాములు చేయటం తదితర అంశాల గురించి ఇంద్రకరణ్ రెడ్డి ఈ సమావేశంలో వివరించారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఐదు సంవత్సరాల క్రితమే తెలంగాణా పర్యావరణ పరిరక్షణ చర్యలు ప్రారంభించారని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. హరిత హారం కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నామని మంత్రి చెప్పారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇంత వరకు 175 కోట్ల మొక్కలను నాటినట్లు ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. నాటిన 175 కోట్ల మొక్కల్లో దాదాపు యాభై శాతం మొక్కలను బతికించుకోగలిగామని ఆయన తెలిపారు ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గం గజ్వేల్‌లో హరితహారంలో భాగంగా చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోందని ఆయన చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణాలో అమలు చేస్తున్న పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందని ఇంద్రకరణ్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఇలాఉండగా సమావేశానంతరం ఇంద్రకరణ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అటవీ సంరక్షణకు తీసుకుంటున్న చర్యల వల్ల రానున్న మూడు, నాలుగు సంవత్సరాల్లో తెలంగాణ ఆకుపచ్చగా మారబోతోందని ఆయన చెప్పారు. అడవి జంతువులకు సోలార్ పవర్ ద్వారా బోర్లు వేసి తాగు నీటి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. జంతువుల ఆహారం కోసం గడ్డి క్షేత్రాలను పెద్ద ఎత్తున అభివృద్ది చేస్తున్నామని ఆయన తెలిపారు. గడ్డి క్షేత్రాలను అభివృద్ది ఆహార కల్పన పథకాల ద్వారా జంతువులు అడవి నుంచి వెలుపలికి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ. 3,110 కోట్ల కంపా నిధులను విడుదల చేసిందనీ, ఈ సంవత్సరం 500 కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన ప్రణాలికల ప్రతిపాదనలను పంపించగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు.

Post Top Ad