పాపికొండలు జల పర్యాటకాన్ని మరింత కఠినతరం - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, December 02, 2019

పాపికొండలు జల పర్యాటకాన్ని మరింత కఠినతరం

వశిష్ట రాయల్ బోటు నిర్లక్ష్యం 50 మందిని బలి తీసుకునేలా చేసింది. దీంతో పాపికొండల పర్యాటకానికి బ్రేక్ పడింది. అయితే మళ్లీ పాపికొండలను చూడలేమా అక్కడికే వెళ్ళలేమా అనుకునేవారి ఎదురు చూపులు త్వరలోనే నెరవేరబోతున్నాయి. కానీ ఈ సారి నిర్దిష్టమైన నిబంధన మధ్య పాపికొండల ప్రయాణం సాగనుంది. నదిలోకి బోటు దిగుతుంది అంటేనే అన్ని ప్రమాణాలు పాటిస్తేనే ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. అంతేకాదు ప్రతి బోటు ప్రయాణం పై వివిధ దశలో నిఘా ఉంచబోతున్నారు. పలు ప్రాంతాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటుతో పాటు పాపికొండల ప్రాంతంలో తిరిగే ప్రతిబొట్టు కదలికలపై ఓ కన్నేసి ఉంచుతున్నారు.
వశిష్ట బోటు ప్రమాదం తరువాత రెండు నెలలుగా పాపికొండల యాత్ర నిలిచిపోవడంతో టూరిజం పై ఆధారపడిన చాలా కుటుంబాలు ఉపాధిని కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ పర్యాటకుల భద్రతే ప్రధానం అన్న కాన్సెప్ట్ తో ప్రభుత్వం ముందుకు కదులుతోంది. జల పర్యాటకాన్ని మరింత కఠినతరం చేస్తోంది. టూరిజం శాఖ ఆధ్వర్యంలోనే ఇక పై బోట్లు నడవనున్నాయి. లైఫ్ జాకెట్ లతో పాటు బోటు అనుకూలత, కండిషన్ ను ఖచ్చితంగా చూడనున్నారు. బోటు డ్రైవర్లకు కూడా మరింత శిక్షణ ఇచ్చి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఏం చెయ్యాలి, ఎలా ముందుకు సాగాలన్న దాని పై శిక్షణ ఇవ్వనున్నారు. టూరిజం అధికారులు ఇప్పటికే 83 బోట్లను పరిశీలించారు. వారిచ్చే సర్టిఫికెట్ల ఆధారంగానే ఆ బోట్లు పాపికొండల్లో తిరుగుతాయా లేదా అన్నది తేలనుంది. పోచవరం వైపు వెళ్లే బోట్లను వెరిఫై చేయవలసి ఉంది. అన్ని అనుమతులు నిబంధనలు పాటిస్తేనే పాపికొండల ప్రయాణం ఉంటుంది. దేవీపట్నం దాటిని తరువాత పాపికొండల ప్రయాణంపై నిఘా ఉండటం లేదు. పెట్రోలింగ్ చేసే అవకాశమూ లేదు. సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో మైనస్ గా మారింది. ఈ క్రమంలో బోటింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘాలో ఆరు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

రాజమహేంద్రవరం, పోసమ్మగండి, దేవీపట్నం, సింగనపల్లి పేరంటాలపల్లి, పోచవరం వద్ద వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతాల్లోనే టిక్కెట్ లను కూడా విక్రయించనున్నారు.వాస్తవానికి బోటు ప్రయాణం చెయ్యడానికి రూట్ మ్యాప్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ బాధ్యత ను ఇరిగేషన్ శాఖ అధికారులకు అప్పగించింది. రూట్ మ్యాప్ సిద్ధమైతే తప్ప బోట్లు తిరిగే ఆస్కారం లేదు. అప్పటి వరకూ ఓ పైలెట్ బోటు నడిపించి ముందుకు సాగుదామనుకున్న ప్రతిపాదన వచ్చినప్పటికీ జిల్లా కలెక్టర్ దానిని తిరస్కరించారు. నిబంధనలు అన్నీ పూర్తయి రూట్ మ్యాప్ వస్తే కానీ బోటు షికారు చేయటం కుదరదని చెప్పేశారు. అప్పటి వరకు పాపికొండలను చూడాలనుకునే వారికి ఎదురు చూపులు తప్పవు.