హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్బులో రేవ్ పార్టీ ఏర్పాట్లను భగ్నం చేసిన పోలీసులు : 21 మంది యువతులను అదుపులోకి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 16, 2020

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్బులో రేవ్ పార్టీ ఏర్పాట్లను భగ్నం చేసిన పోలీసులు : 21 మంది యువతులను అదుపులోకి

ఈ నెల 12వ తేదీ రాత్రి జూబ్లీహిల్స్‌ రోడ్ నం.10లోని ఎఫ్ఏఐ పబ్బులో రేవ్ పార్టీకి ఏర్పాట్లు జరిగాయి. ఓ ఫార్మా కంపెనీ తమ సేల్స్ పెంచుకునేందుకు.. డాక్టర్లు, ఉద్యోగుల కోసం ఈ పార్టీ ఏర్పాటు చేసినట్టు పోలీసులకు సమాచారం అందింది. అర్ధనగ్న నృత్యాలు,వ్యభిచారం కోసం వివిధ రాష్ట్రాల నుంచి యువతులను కూడా రప్పించినట్టు తెలిసింది. దీంతో ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ పబ్బుపై దాడి చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్బులో రేవ్ పార్టీ ఏర్పాట్లను పోలీసులు భగ్నం చేశారు. పక్కా సమాచారంతో పబ్బుపై దాడి చేసిన పోలీసులు 21 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులకు సమాచారం చేరిందన్న విషయం తెలిసి.. నిర్వాహకులు అప్పటికే పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు ప్రస్తుతం ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. రేవ్ పార్టీ ఎవరి కోసం ఏర్పాటు చేశారు..? ఎవరెవరు ఇందులో పాల్గొనాలనుకున్నారు..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. టాస్క్‌ఫోర్స్ దాడులపై సమాచారం అందుకున్న పబ్ యజమానులు సంతోష్ రెడ్డి,భరత్‌లు,రేవ్ పార్టీ నిర్వాహకులైన శ్రీనివాస్ నాయుడు, ప్రసాద్ అప్పటికే అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో పబ్ మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు 21 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ యువతుల్లో పక్క రాష్ట్రాలకు చెందినవారితో పాటు నెల్లూరు యువతులు కూడా ఉన్నట్టు గుర్తించారు. సినిమా అవకాశాల కోసం వచ్చి.. అవకాశాలు లేక వ్యభిచార రొంపిలోకి దిగి.. ఇలా రేవ్ పార్టీల్లో పాల్గొంటున్నట్టు గుర్తించారు. ఈవెంట్‌ ఆర్గనైజర్‌ ప్రసాద్‌ ప్రతి ఏటా రేవ్‌ పార్టీలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. తనిఖీల అనంతరం పబ్ యాజమాన్యానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీసులు కలిసి ఈ ఆపరేషన్ చేపట్టారు. మరో ఐదు నిమిషాల్లో పార్టీ మొదలవుతుందనగా పబ్‌పై దాడి చేసినట్టు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను నియమించినట్టు చెప్పారు.