పెద్దకొత్తపల్లి మండలంలోని చంద్రకల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 144 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో 125 మంది గురువారం పాఠశాలకు హాజరై ఎప్పటిలాగే మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం మూడు గంటలకు 44 మందికి తీవ్ర కడుపునొప్పితో వాంతులు చేసుకున్నారు. ఇది గమనించిన హెచ్ఎం శ్రీనివాసులు వెంటనే 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, వీరిలో పదో తరగతి విద్యార్థులు మానస, ప్రేమలత, మంజుల, లక్ష్మి, వంశీలకు పరిస్థితి విషమంగా మారడంతో ఐసీయూలో ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. ఇదిలాఉండగా అధికారుల పర్యవేక్షణలోపం, నాసిరకమైన మధ్యాహ్న భోజనం అందించడం వల్లే ఇలా జరిగిందని విద్యార్థులు ఆరోపించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి, డీఈఓ గోవిందరాజులు అక్కడికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ ఘటనపై విచారణ జరిపి త్వరలోనే బాధ్యులపై చర్య తీసుకుంటామన్నారు. దీనిపై హెచ్ఎం శ్రీనివాసులును వివరణ కోరగా రోజూలాగే వంట ఏజెన్సీ మహిళలు తయారుచేసిన వంకాయ కూరతో కూడిన మధ్యాహ్న భోజనం అందించామన్నారు. ఈ కూరలో ఏమైనా కలిసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )