నవరత్నాలు’లో భాగంగా ‘అమ్మ ఒడి’ పథకాన్ని చిత్తూరులో ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 09, 2020

నవరత్నాలు’లో భాగంగా ‘అమ్మ ఒడి’ పథకాన్ని చిత్తూరులో ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి


పేదింటి పిల్లలు బాగా చదవుకోవాలి, అన్ని రంగాల్లో ఎదురవుతున్న పోటీని ఎదుర్కోవాలి
ఆ దిశగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది
చదువే పిల్లలకిచ్చే ఆస్తి, అదే నిజమైన సంపద
పిల్లలను బడికిపంపే పేదింటి తల్లులకు అమ్మఒడి ద్వారా ఏటా రూ.15000. ఈ పథకం ద్వారా 42,12,186 మంది తల్లులకు, 81,72,224 మంది పిల్లలుకు మేలు.అమ్మఒడి కోసం రూ.6456 కోట్లు కేటాయించిన ప్రభుత్వం. 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవైటు, ఎయిడెడ్, గురుకులపాఠశాలలు, కళాశాల విద్యార్ధుల తల్లులకు జగనన్న ఆమ్మఒడి. నేరుగా తల్లుల ఖాతాలో రూ.15వేలు జమ. బ్యాంకులు జమ చేసుకోకుండా అన్‌ఇన్‌కంబర్డ్‌ ఖాతాల్లో జమ. పిల్లలకు ఈ యేడు 75 శాతం హాజరు శాతం నుంచి మినహాయింపు. ఎన్నికల మేనిఫెస్టోలో 10వ తరగతి వరకే అని చెప్పినా, ఇంటర్‌ వరకు పొడిగించాం. మీ పిల్లలను ఇంగ్లీష్‌ మీడియంలో చదివించాలా వద్దా*ఇంగ్లీష్‌ మీడియం కావాలన్న ప్రజల అభీష్టం ఈనాడుకు వినిపించదు*. చంద్రబాబుకు వినిపించదు. ఇంకొక సినిమా యాక్టర్‌కు కూడా వినిపించదు. ఇప్పటికైనా ప్రజల మనోభీష్టం వినిపిస్తుందనుకుంటున్నాను. ఇంగ్లీష్‌ మీడియమ్‌లో ఇబ్బందులొస్తాయి, అందుకే బ్రిడ్జి కోర్సులు. తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్‌.  ప్రభుత్వ పాఠశాలల్లో చదవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలకు అన్యాయం జరగరాదు. మధ్యాహ్న భోజనంలో మెనూలో సమూల మార్పులు. మనబడి నాడు–నేడు ద్వారా 40 వేల స్కూళ్లలో సమూల మార్పులు. ప్రతి తల్లికి రూ.15వేలు అన్నగా తోడుగా ఉంటూ ఇస్తున్నా పిల్లలకు మేనమామగా బాధ్యతతో ప్రతి స్కూల్‌ రూపురేఖలు మారుస్తాం. అర్హత ఉండి ఈ పథకంలో నమోదు చేసుకోకపోతే నెల రోజుల గడువిస్తున్నాం.వచ్చే నెల 9 లోగా గ్రామ సచివాలయాల్లో పేరు నమోదు చేసుకొండి. జగనన్న విద్యా దీవెనలో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌.విద్యావసతిలో హాస్టల్, మెస్‌ ఛార్జీల కింద ఏటా రూ.20 వేలు.ఏటా రెండు విడతల్లో తల్లుల ఖాతాల్లో నేరుగా ఆ మొత్తం జమ. పాఠశాలల్లో బాత్‌రూమ్‌ల నిర్వహణ. వాచ్‌మెన్‌ల బాధ్యత చూడండి. పేరెంట్‌ కమిటీలకు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచన. అందుకోసం ఒక్క వెయ్యి రూపాయలు పేరెంట్‌ కమిటీకి ఇవ్వండి. అమ్మఒడి పథకం లబ్ధిదారులైన పేదింటి తల్లులకు సీఎం వినతి

పేదింటి పిల్లలు కూడా బాగా చదువుకోవాలని, ఇవాళ అన్ని రంగాలలో ఎదురవుతున్న పోటీని వారూ ఎదుర్కోవాలని, ఆందుకే ఆ దిశలోనే ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలోనే అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టామని ఆయన ప్రకటించారు. చదువు అనేది పిల్లలకు నిజంగా ఇచ్చే ఆస్తి అని, ఇదే నిజమైన సంపద అని పేర్కొన్న ఆయన, ఈ ఉద్దేశంతోనే రాజ్యాంగంలో ఒక ప్రాథమిక హక్కుగా చేర్చారని గుర్తు చేశారు. అయితే చట్టం చేసినా దాన్ని పక్కాగా అమలు చేయలేకపోయారని అన్నారు. 
పిల్లలను చదివించే పరిస్థితి ఇళ్లలో ఉండాలని, అదే సమయంలో స్కూళ్లు కూడా బాగుండాలని, తరగతి గదుల్లో పాఠం వినాలన్నా పేదింటి పిల్లల కడుపు నిండాలని సీఎం స్పష్టం చేశారు. ఆ దిశలోనే ప్రభుత్వం పలు అడుగులు వేసిందని చెప్పారు. పిల్లలను బడికి పంపించే పేదింటి తల్లులకు అమ్మ ఒడి పథకంలో భాగంగా ఏటా రూ.15 వేలు ఇస్తున్నామని ప్రకటించారు, 42,12,186 మంది తల్లులకు, తద్వారా 81,72,224 మంది పిల్లలకు మేలు కలిగేలా ఈ పథకంలో తొలుత రూ.6318 కోట్లు చెల్లిస్తున్నామని వెల్లడించారు, ఇంకా జగనన్న విద్యా దీవెనలో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయడంతో పాటు, విద్యా వసతి పథకంలో హాస్టల్, మెస్‌ ఛార్జీల కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని, ఏటా రెండు విడతల్లో తల్లుల ఖాతాల్లో నేరుగా ఆ మొత్తం జమ చేస్తామని తెలిపారు.
పాఠశాలల్లో బాత్‌రూమ్‌ల నిర్వహణ. వాచ్‌మెన్‌ల బా«ధ్యత చూడాలని పేరెంట్‌ కమిటీలకు సూచించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, అందుకోసం ఒక్క వెయ్యి రూపాయలు పేరెంట్‌ కమిటీకి ఇవ్వాలని, అమ్మఒడి పథకం లబ్ధిదారులైన పేదింటి తల్లులను ఆయన కోరారు. తద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులపై ప్రశ్నించే అవకాశం కూడా వస్తుందని ఆయన పేర్కొన్నారు. 
విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ దేశ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పిల్లల చదువుల బడి’.. ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరులో గురువారం ప్రారంభించారు. పిల్లలను బడికి పంపే పేద తల్లులు లేదా ఆ పిల్లల సంరక్షకులకు ఈ పథకంలో భాగంగా ఏటా రూ.15 వేలు అందిస్తారు.
ఒకటవ తరగతి నుంచి ఇంటర్‌ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం వర్తించనుంది. ఈ పథకంలో ఇప్పటికే దాదాపు 43 లక్షల మంది తల్లులను గుర్తించగా, తద్వారా సుమారు 82 లక్షల మంది పిల్లలకు లబ్ధి కలగనుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.6456 కోట్లు కేటాయించింది. 
తాడేపల్లి నుంచి నేరుగా చిత్తూరు వచ్చిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ స్థానిక డిఎస్‌ఏ స్టేడియమ్‌లో హెలికాప్టర్‌ దిగారు. అక్కణ్నుంచి రోడ్డు మార్గంలో 5 కి.మీ ప్రయాణించి పట్టణంలోని పీవీకెఎస్‌ డిగ్రీ కళాశాల ప్రాంగణం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానికులు ప్రతి చోటా ఘన స్వాగతం పలికారు. పీవీకెఎస్‌ కళాశాలలో విద్యా శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శించిన సీఎం, అనంతరం స్థానికంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు, వాటి శిలా ఫలకాలు ఆవిష్కరించారు.
సంక్రాంతి పండగ తర్వాత నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో అమలు చేయనున్న కొత్త మెనూ ప్రకారం తయారు చేసిన వంటలను సీఎం రుచి చూశారు. ఇంకా పాదయాత్రలోని ముఖ్యమైన ఘట్టాలతో కూడిన చిత్ర ప్రదర్శనను ఆయన తిలకించారు. అనంతరం అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు.

*పథకం మీకే అంకితం*
ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడు, ప్రతి స్నేహితుడికి.. వీరే కాకుండా వారితో పాటు వచ్చిన ప్రతి చిన్నారికి, ఈ పథకాన్ని అంకితం చేస్తున్నానంటూ సీఎం తన ప్రసంగం ప్రారంభించారు. ఇక్కడ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించడం దేవుడు తనకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

*అందుకే ఈ కార్యక్రమం*
ప్రతి బిడ్డ ఎదిగేది అమ్మ ఒడిలోనే అని, ప్రతి తల్లి తన బిడ్డను గుండెలకు హత్తుకుని ప్రపంచానికి చూపుతుందని, ప్రాణానికి ప్రాణంగా పెంచుతుందని, తన ప్రాణం కన్నా తన పిల్లలే ఎక్కువని భావించడమే కాకుండా, వారి కోసం సర్వం త్యాగం చేస్తుందని సీఎం పేర్కొన్నారు. 
అలాంటి అమ్మలు, అక్కా చెల్లెమ్మలను తన సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్రలో ప్రతి ఊరిలో చూశానన్న ఆయన, పిల్లలను చదివించాలన్న తాపత్రయం అందరిలో ఉంటుందని చెప్పారు. 
‘ఆ పేదింటి తల్లులు, ఆ పిల్లలకు అండగా ఉండేందుకు ఈ కార్యక్రమం. ఈ మీటింగ్‌ కాగానే కంప్యూటర్‌లో బటన్‌ ఆన్‌ చేయగానే దాదాపు 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ అవుతుంది’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

*అందులో భాగంగానే అమ్మ ఒడి*
చదువు అనేది నిజంగా పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి అని, అదే నిజమైన సంపద అని, ఆ ఉద్దేశంతోనే రాజ్యాంగంలో చదువును ప్రాథమిక హక్కుగా పేర్కొన్నారని సీఎం గుర్తు చేశారు. దాని ప్రకారమే 6 నుంచి 14 ఏళ్ల పిల్లలు చదువుకోవడం ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో చేర్చారని చెప్పారు. అయితే చట్టం చేసినా దాన్ని అమలు చేయలేకపోయారని తెలిపారు. 
‘పిల్లలను చదివించే పరిస్థితి ఇళ్లలో ఉండాలి. స్కూళ్లు కూడా బాగుండాలి. తరగతి గదుల్లో పాఠం వినాలన్నా పేదింటి పిల్లల కడుపు నిండాలి. ఇంకా పేదింటి పిల్లలు కూడా పోటీ తట్టుకునే నిల్చే పరిస్థితి రావాలి. ఆ దిశలో ఈ ప్రభుత్వం అడుగులు వేసింది. అందులో భాగంగానే అమ్మ ఒడి పథకం ప్రారంభిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వివరించారు.

*అప్పుల కింద జమ చేయకుండా*..
ఒకటి నుంచి ఇంటర్‌ వరకు పిల్లలను చదివిస్తున్న పేదింటి తల్లుల ఖాతాలో నేరుగా రూ.15 వేలు ఇచ్చే కార్యక్రమానికి చిత్తూరు నుంచే శ్రీకారం చుడుతున్నామని సీఎం చెప్పారు. ఆ తల్లులకు ఏమైనా అప్పులు ఉంటే, ఈ మొత్తం అందులో జమ చేసుకోకుండా బ్యాంకర్లతో కూడా మాట్లాడామని, ఈ మొత్తం అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో జమ చేస్తున్నామని వెల్లడించారు.
అలా 42,12,186 మంది తల్లులకు, తద్వారా 81,72,224 మంది పిల్లలకు మేలు కలిగే విధంగా ఇప్పుడు రూ.6318 కోట్లు ఇస్తున్నామని చెప్పారు.

*ఒక అన్నగా తోడు*
రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఎన్నో ఉన్నాయని, వారి పిల్లల చదువులు ఆగకూడదన్న ఆలోచనతోనే ప్రతి అక్కకు సహాయం చేసేందుకు ఈ అన్న తోడుగా ఉండేందుకు వచ్చాడని సీఎం పేర్కొన్నారు.

*75 శాతం హాజరు*
పిల్లలను చదివించే తల్లులకు ఏటా రూ.15 వేలు ఇస్తామన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఆ పిల్లలకు తప్పనిసరిగా 75 శాతం హాజరు ఉండాలన్నది వచ్చే ఏడాది నుంచి కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది మాత్రం ఆ నిబంధనను మినహాయించామన్న ఆయన, ఈ ఆర్థిక సహాయం చేస్తామన్న నమ్మకం అక్కా చెల్లెమ్మలకు కలగాలి కాబట్టి, ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 

*10వ తరగతి వరకే అనుకున్నా*..
అమ్మ ఒడి పథకాన్ని ఒకటి నుంచి 10వ తరగతి వరకు మాత్రమే అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించామని గుర్తు చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఆ తర్వాత పథకాన్ని ఇంటర్‌ వరకు పొడిగించామని చెప్పారు. పిల్లల చదువు కోసం మరో అడుగు కూడా వేశామన్న ఆయన, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియమ్‌ను ప్రస్తావించారు.

*ఇంగ్లిష్‌ మీడియమ్‌ కావాలా? వద్దా?*
‘ఇక్కడ ఉన్న తల్లిదండ్రులను, టీవీల్లో ఈ కార్యక్రమం చూస్తున్న వారందరినీ ఈ వేదిక నుంచి ఒకటే అడుగుతున్నాను. మీ పిల్లలను ఇంగ్లిష్‌ మీడియమ్‌ చదువులు చదివించాలా? వద్దా? మీరే చెప్పండి. ఇంగ్లిష్‌ మీడియమ్‌ చదువులు మీ పిల్లలకు కావాలా? వద్దా? చెప్పండి’.
‘ఇది ఈనాడుకు వినిపించదు. చంద్రబాబుకు వినిపించదు. ఇంకొక సినిమా యాక్టర్‌కు కూడా వినిపించదు. కనీసం ఇప్పటికైనా వారికి ప్రజల మనోభీష్టం వినిపిస్తుందనుకుంటున్నాను’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

*అమలు ఎలా?*
వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం అంటే, ఈ ఏడాది జూన్‌ నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెడుతున్నామని, ఆ తర్వాత ఒక్కో ఏడాది ఒక్కో క్లాస్‌ పెంచుకుంటూ పోతామని, ఆ విధంగా వచ్చే 4 ఏళ్లలో మన పిల్లలంతా పదవ తరగతి బోర్డు పరీక్ష ఇంగ్లిష్‌ మీడియమ్‌లో రాసే పరిస్థితి వస్తుందని చెప్పారు.

*ఇబ్బందులూ ఉన్నాయి. అందుకే..*
  ఇంత కాలం తెలుగు మీడియమ్‌లో చదివిన పిల్లలు ఇంగ్లిష్‌ మీడియమ్‌లో చదవడానికి కొన్ని ఇబ్బందులు వస్తాయన్న సీఎం, అందుకే వారికి బ్రిడ్జి కోర్సులు తీసుకు వస్తున్నామని, టీచర్లకు కూడా శిక్షణ మాడ్యుల్స్‌ తయారు చేస్తున్నామని, అదే సమయంలో తెలుగును తప్పనిసరి సబ్జెక్టు చేశామని చెప్పారు.

*పిల్లలను గాలికి వదిలేయలేం కదా?*
‘జూన్‌ 2020లో ఒకటి నుంచి 6వ తరగతి వరకు చదువుతున్న పిల్లలు.. 2030 లేదా ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేస్తారు. ఆ తర్వాత పీజీ కూడా పూర్తి చేస్తారు. అదే 2020లో పుట్టిన పిల్లలు 2042లో డిగ్రీ పూర్తి చేస్తారు. అప్పటికి వారు ప్రపంచంలో పోటీని తట్టుకునే విధంగా ఇంగ్లిష్‌ మీడియమ్‌లో చదువులు చెప్పించాలా?. లేక ఒక రాజకీయ నాయకుడు, పత్రికాధిపతి, సినిమా యాక్టర్‌.. వారు ఎవ్వరూ తమ పిల్లలను తెలుగులో చదివించడం లేదు. మరి మన పిల్లలను కూడా ఇంగ్లిష్‌ మీడియమ్‌లో చదివించకుండా గాలికి వదిలేద్దామా?’ అని సీఎం ప్రస్తావించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, పేదరికంలో ఉన్న అగ్రవర్ణాల వారి పిల్లలే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారని, వారికి అన్యాయం జరగకూడదని, అందుకే ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా మార్చబోతున్నామని, సిలబస్‌ కూడా మారుస్తున్నామని, మధ్యాహ్న భోజనం మెనూలో కూడా సమూలు మార్పులు చేస్తున్నామని చెప్పారు. 

*ఒక్క జగన్‌ మాత్రమే!*
‘పిల్లల చదువు గురించి నేను ఇంతగా ఆరాట పడుతుంటే, దేశంలో ఎవరూ ఈ ఆలోచన చేయలేదని ఇటీవల ఎవరో కూడా అన్నారు. పిల్లలు చదివే చదువులే కాకుండా ఆ పిల్లలు బాగుండాలని, మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు తీసుకు రావాలని మెనూ కూడా చూస్తున్న ఏకైక సీఎం ఒక్క జగన్‌ మాత్రమే అనుకుంటున్నాను. రోజూ ఇదేనా భోజనం? అని పిల్లలు అనుకోవద్దు. అందుకే కొత్త మెనూ కార్డు. ఆ మేరకు సోమవారం నుంచి శనివారం వరకు మెనూలో మార్పులు చేశాము అంటూ’.. రోజు వారీ విద్యార్థుల మధ్యాహ్న భోజన మెనూను చదివి వినిపించారు. 

*రూ.200 కోట్లు ఖర్చవుతున్నా..*
ఏం పెడితే పిల్లలు బాగుంటారని బహుషా ఏ సీఎం కూడా ఆలోచించి ఉండరన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్, అంతగా ఈ పిల్లల గురించి ఆలోచన చేశామని చెప్పారు. ఈ మార్పుల కోసం దాదాపు రూ.200 కోట్లు ఎక్కువ ఖర్చైనా భరిస్తున్నామని చెప్పారు.
ఇంకా ఈ భోజనం పెట్టే ఆయాల గురించి కూడా ఆలోచించామన్న ఆయన, గతంలో వారికి ముష్టి వేసినట్లుగా రూ.1000 మాత్రమే ఇచ్చేవారని, వారికి నెలల తరబడి బిల్లులు ఇచ్చే వారు కాదని గుర్తు చేశారు.
అందుకే వారి గౌరవ వేతనం రూ.3 వేలు చేయడంతో పాటు, బిల్లులు కూడా వెంటనే ఇస్తున్నామని, అందుకు మరో రూ.160 కోట్లు ఖర్చవుతున్నా భరిస్తున్నామని వివరించారు.

*మనబడి నాడు–నేడు*
ఇంకా మనబడి నాడు–నేడు కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారుస్తున్నామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో 40 వేలకు పైగా స్కూళ్లు ఉన్నాయన్న ఆయన, శిధిలావస్తకు చేరిన బడులను చదువుల దేవాలయాలుగా మార్చేందుకు అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. ఆయా స్కూళ్లు ప్రస్తుత ఫోటోలు తీస్తామని, వాటి రూపురేఖలు మార్చాక ఆ ఫోటోలు చూపుతామని చెప్పారు. తొలి దశలో 15 వేలకు పైగా స్కూళ్లను పూర్తిగా మార్చబోతున్నామని, వాటిలో ఇంగ్లిష్‌ ల్యాబ్‌తో సహా, అన్ని వసతులు కల్పించబోతున్నామని తెలిపారు. ఆ పనులు సంక్రాంతి నుంచి మొదలువుతాయని చెప్పారు.

*స్కూళ్లు తెరవగానే కిట్లు*
ఇప్పటి వరకు విద్యా సంవత్సరం ఆరంభమై సగం గడిచినా పిల్లలకు పుస్తకాలు, యూనిఫామ్స్‌ అందడం లేదన్న సీఎం, ఈ పరిస్థితి కూడా మారుస్తూ, స్కూళ్లు తెరవగానే పిల్లలకు ఒక కిట్‌ ఇస్తామని ప్రకటించారు. 
3 జతల యూనిఫామ్స్, పుస్తకాలు, బూట్లు, సాక్సులు, బెల్టుతో కూడిన ఒక స్కూల్‌ బ్యాగ్‌ కిట్‌ను స్కూళ్లు తెరవగానే పిల్లలకు ఇస్తామని వెల్లడించారు. ఇంకా పాఠశాలల్లో బోధన ప్రమాణాలు పెంచడంతో పాటు, టీచర్లకు అవసరమైన శిక్షణ. విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు ప్రవేశపెడుతున్నామని వివరించారు.

*ఉన్నత విద్యా రంగంలో దారుణస్థితి*
ఇంటర్‌ తర్వాత పిల్లల పరిస్థితి దారుణంగా ఉందన్న సీఎం, దేశంలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషో (జీఈఆర్‌) చూస్తే, ఇంటర్‌ తర్వాత అది కేవలం 23 శాతం మాత్రమే ఉందని చెప్పారు. 

*జగనన్న విద్యా దీవెన*
‘ఈ పరిస్థితికి కారణం.. చదువులు భారమయ్యాయి. చదివించలేని స్థితిలో ఆ కుటుంబాలు ఉన్నాయి. ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేదరికంలో ఉన్న అగ్రవర్ణాల పిల్లల జీవితాలు మార్చడం కోసం, వారికి అండగా ఉండేందుకు.. జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయబోతున్నాము. దాంతో పాటు వసతి దీవెన కూడా అమలు చేయబోతున్నాం. పిల్లల హాస్టల్, మెస్‌ ఛార్జీల కింద ప్రతి పిల్లవాడికి ఏటా రూ.20 వేలు ఇస్తాము. ఆ మొత్తం నేరుగా ఆ పిల్లల తల్లుల ఖాతాలో జమ చేస్తాము. తొలుత.. జనవరి, ఫిబ్రవరిలో రూ.10 వేలు, ఆ తర్వాత జూలై, ఆగస్టులో మిగిలిన రూ.10 వేలు ఇస్తాము’ అని ముఖ్యమంత్రి వివరించారు.

*ఏడాది క్రితం ఇదే రోజు*
ఆ విధంగా భోజనం కోసం కూడా పిల్లలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపడుతున్నామన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, 29 రాష్ట్రాలలో కేవలం ఏపీలో మాత్రమే అమ్మ ఒడి పథకం అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. సరిగ్గా గత ఏడాది ఇదే రోజున తన 3648 కి.మీ పాదయాత్ర ముగిసిందని, ఇవాళే అమ్మ ఒడి పథకం ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. 

*మేనమామగా బాధ్యత ఇస్తున్నాను*
‘ప్రతి తల్లికి రూ.15 వేలు ఒక అన్నగా తోడుగా ఉంటూ జగనన్న ఇస్తున్నాడు. ఆ పిల్లలకు మేనమామగా ఒక బాధ్యత కూడా ఇస్తున్నాడు. ఒక విజ్ఞప్తి చేస్తున్నాడు. అది ఏమిటంటే.. ప్రతి స్కూల్‌ రూపురేఖలు మారుస్తున్నాము. వాటిలో ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెడుతున్నాము. పేరెంట్స్‌ కమిటీలు కూడా ఏర్పాటవుతున్నాయి. కాబట్టి ఆ స్కూళ్ల పనితీరు మార్చడంలో మీరంతా మమేకం కావాలి. ఇందు కోసమే పేరెంట్స్‌ కమిటీలు తీసుకువచ్చాము’. 
‘నా విన్నపం. మీ బడులలో బాత్‌రూమ్‌లు ఉంటాయి. వాచ్‌మెన్‌లు ఉంటారు. ఇతర కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ బాత్‌రూమ్‌లు, వాచ్‌మెన్ల మీద పేరెంట్‌ కమిటీలు దృష్టి పెట్టాలి’ అని సీఎం కోరారు.

*ఒక్క వెయ్యి రూపాయలు ఇవ్వండి* 
‘మీ బడులలో బాత్‌రూమ్‌ల నిర్వహణకు ఒక మనిషిని పెట్టుకుంటే జీతం రూ.4 వేలతో పాటు, క్లీనింగ్‌ కోసం మరో రూ.2 వేలు ఖర్చవుతాయనుకోండి. అదే విధంగా వాచ్‌మెన్‌ను పెట్టుకుంటే మరో రూ.4 వేలు ఖర్చవుతాయనుకోండి. ఆ విధంగా ఈ చిన్న సొమ్ము (రూ.10 వేలు)లో మీరంతా భాగస్వాములైతే, మీకు బాధ్యత ఉంటుంది. స్కూళ్లు బాగుంటాయి. కాబట్టి ఇవాళ మీకు ఇస్తున్న రూ.15 వేలల్లో ఒక్క వెయ్యి రూపాయలు పేరెంట్స్‌ కమిటీలకు ఇస్తే, స్కూళ్లలో బాత్‌రూమ్‌లు బాగుంటాయి. వాచ్‌మెన్లు వస్తారు. కాబట్టి ఒక్క వెయ్యి రూపాయలు డొనేట్‌ చేయండి. మిగిలిన రూ.14 వేలు మీరే ఉంచుకోండి. అలా ఇవ్వడం వల్ల స్కూళ్లలో బాత్‌రూమ్‌లు ఎలా ఉన్నాయని, భద్రత ఎలా ఉందని మనం పేరెంట్‌ కమిటీలను అడగవచ్చు’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
కాబట్లి పిల్లల తరపున పిల్లల మేనమామగా విజ్ఞప్తి చేస్తున్నానన్న సీఎం, . వీటన్నింటి వల్ల పిల్లల భవిష్యత్తు బాగుంటుందని భావిస్తున్నానని చెప్పారు. 

*ఇవాళ ఎందరికి?*
ఇవాళ కంప్యూటర్‌లో బటన్‌ నొక్కడం ద్వారా 81,72,224 మంది పిల్లలకు లబ్ధి కలిగేలా 42,12,186 మంది తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున మొత్తం  రూ.6318 కోట్లు జమ అవుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.

*మరో నెల రోజులు*
అర్హత ఉన్నప్పటికీ పొరపాటున ఎవరైనా ఈ పథకంలో నమోదు చేసుకోకపోతే, వారికి నెల రోజుల పాటు అవకాశం ఇస్తున్నట్లు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రకటించారు, వారంతా వచ్చే నెల 9వ తేదీలోగా గ్రామ సచివాలయాలకు వెళ్లి, తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. 
చివరగా, అందరికి మంచి జరగాలని, ఆ దేవుడి దయ, అందరి చల్లని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానంటూ, సీఎం తన ప్రసంగం ముగించారు. 

ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, మంత్రులు శ్రీ ఆదిమూలపు సురేష్, శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ మేకపాటి గౌతమ్‌రెడ్డితో పాటు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

*ఆకట్టుకున్న విద్యార్థులు. తల్లులు:* 
కాగా, కార్యక్రమంలో మాట్లాడిన ఇద్దరు విద్యార్థినిలు, ఒక తల్లి అందరినీ ఆకట్టుకున్నారు.
నవ్య ప్రజ్వలిక, 10 వ తరగతి, శాంతిపురం
– ‘మా అమ్మ సహాయ వంట మనిషిగా పని చేస్తోంది. మా నాన్న నిరుద్యోగి. నా గోల్‌ ఐఏఎస్‌ కావడమే. ఈ పథకం నాకెంతో ఉపయోగపడనుంది. ఈ పథకాన్ని వినియోగించుకుని నేను బాగా చదువుకుంటాను. స్మార్ట్‌ ఫోన్‌కు ఇచ్చిన ప్రాధాన్యం ఇన్నాళ్లూ మన కంటికి ఇవ్వలేదు. కానీ సీఎం గారు వైయస్సార్‌ కంటి వెలుగు ద్వారా మా కళ్లకు పరీక్షలు చేయించారు. మధ్యాహ్న భోజన పథకంలో పలు మార్పులు చేసి, మాకు చక్కగా భోజనం పెడుతున్నారు. ఒక అన్నలా, ఒక తండ్రిలా, ఒక అమ్మలా ఆలోచించి మాకు ఎంతో మేలు చేస్తున్నారు’.

*కల్పవృక్షిణి, విద్యార్థిని*
– ‘జగనన్న అమ్మ ఒడి పథకంతో విద్యార్థి లోకం ఎంతో సంతోష పడుతోంది. ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా నాడు శ్రీ వైయస్‌ జగన్‌ చెప్పారు. నేను విన్నాను. నేను చూశాను. నేను ఉన్నాను.. అన్నారు. అందుకే ప్రజలంతా రావాలి జగన్‌.. కావాలి జగన్‌ అనుకున్నారు. ఇవాళ మా మేలు కోసం సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ గారు ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అమ్మ ఒడి పథకంలో రూ.15 వేలు మా అమ్మకు ఇస్తున్నారు. ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెట్టి, మా బతుకులు మార్చబోతున్నారు. ఇంకా నాడు–నేడు కార్యక్రమంలో స్కూళ్ల రూపురేఖలు మారబోతున్నాయి. అందుకు సీఎం గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఐఏఎస్‌ అధికారి కావాలన్నది నా లక్ష్యం. ఆ దిశలో ఈ కార్యక్రమాలు, పథకాలు నాకెంతో మేలు చేస్తాయని భావిస్తున్నాను. అసాధ్యాలను సాధ్యం చేసి చూపుతున్న సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ గారికి మనసారా ధన్యవాదాలు’.

*శ్రీదేవి, విద్యార్థి తల్లి*
– ‘సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు స్వయంగా చూసిన శ్రీ వైయస్‌ జగన్‌ గారు, వాటి పరిష్కారం కోసం నవరత్నాలు ప్రకటించారు. వాటిలో కీలకమైంది ఈ అమ్మ ఒడి పథకం. ఈ పథకం మా వంటి పేదలకు ఎంతో మేలు చేస్తుంది. మేము మా పిల్లలను బడికి పంపే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు రూ.15 వేల సహాయం చేస్తున్నందువల్ల, పిల్లలను బడికి పంపించగలుగుతున్నాను. ఇంకా ఇంగ్లిష్‌ మీడియమ్‌పై నిర్ణయం కూడా పిల్లలకు ఎంతో మేలు చేయనుంది. ఇక నాడు–నేడు కార్యక్రమం కూడా ఎంతో మేలు చేయనుంది. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయి. తద్వారా పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుండనుంది’.