రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో చిరుత పులి హల్‌ చల్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, January 21, 2020

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో చిరుత పులి హల్‌ చల్


 రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో చిరుత పులి హల్‌ చల్ చేసింది. అర్ధరాత్రి పటేల్ రోడ్డుకు వచ్చిన చిరుత.. మన్నే విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇంటిపైకి ఎక్కి దాక్కుంది. పూల కుండీల మధ్యలో నిద్రించింది. పక్కనే కమ్మదనం అటవీక్షేత్రం ఉంది. చాలా రోజులుగా చిరుతపులి అక్కడ సంచరిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ నిజంగా చిరుతపులి షాద్‌ నగర్ పట్టణంలోని నడిబొడ్డులో ప్రత్యక్షం కావడంతో జనం భయాందోళన చెందారు.  ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫారెస్ట్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతకు మత్తు మందు ఇచ్చి దానిని బంధించారు. అనంతరం దానిని జూకు తరలించారు. అయితే.. చిరుతను బంధించే క్రమంలో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయని తెలిపారు పోలీస్‌ అధికారి. మరోవైపు అటవీ ప్రాంతాలు ఉన్నచోట చిరుతల సంచరించడం సాధారణమే అంటున్నారు అటవీశాఖ అధికారులు. చిరుత సంచారం గురించి తమకు సమాచారం అందిన వెంటనే స్పందిస్తున్నామని తెలిపారు. అటవీ ప్రాంతాలకు దగ్గర్లో నివసించేవారికి అన్ని జాగ్రత్తలు సూచిస్తున్నామని చెప్పారు. 
మొత్తానికి 5 గంటలపాటు సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌ విజయవంతంగా ముగియడంతో అటవీశాఖతోపాటు పోలీస్‌ అధికారులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు షాద్‌నగర్‌ వాసులు మాత్రం ఇంకా షాక్‌లోనే ఉన్నారు. 

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )