ఎల్లారెడ్డిపేట సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అరెస్టు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, January 04, 2020

ఎల్లారెడ్డిపేట సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అరెస్టు

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో గత నెల 19న ఇసుక తరలిస్తున్న మినీ టిప్పర్‌ వాహనాన్ని ఎల్లారెడ్డిపేట సీఐ లింగమూర్తి లచ్చపేట గ్రామ శివారులో పట్టుకున్నారు. వాహనాన్ని గంభీరావుపేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వాహన యజమాని సింహాచలంది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం. తన వాహనాన్ని వదిలిపెట్టాలని గంభీరావుపేట ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ను సంప్రదించగా.. కొంత డబ్బు సమకూర్చుకోవాలని సూచించాడు. సింహాచలం అక్కడే ఉన్న కానిస్టేబుల్‌ కనుకరాజును కలిస్తే రూ.25 వేలు లంచం కావాలని డిమాండ్‌ చేశాడు. దీనిపై బాధితుడు ఎల్లారెడ్డిపేట సీఐ లింగమూర్తిని కలసి విషయం చెప్పగా.. తాను ఎస్‌ఐతో మాట్లాడుతానని చెప్పి పంపించారు.పోలీస్‌స్టేషన్‌లో సీఐ, ఎస్‌ఐలు కలసి రూ.20 వేలు కావాలని డిమాండ్‌ చేశారు. తాను రూ.10 వేలు మాత్రమే ఇస్తానని బాధితుడు బతిమిలాడితే సరేనని అంగీకరించారు. అనంతరం సింహాచలం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శుక్రవారం రూ.10 వేలను కానిస్టేబుల్‌ కనుకరాజుకు పోలీస్‌స్టేషన్‌లో ఇవ్వగానే.. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )