భారీ ర్యాలీతో హైదరాబాద్ ముస్లింలు మరోసారి వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ముస్లిం యునైటెడ్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పాతబస్తీలోని మీరాలంలో శుక్రవారం (జనవరి 10) మధ్యాహ్నం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్నార్సీకి వ్యతిరేకంగా చేపట్టిన ఈ ర్యాలీకి వయోభేదం లేకుండా మహిళలు, చిన్నారులు, వృద్దులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేత పట్టుకొని మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మీరాలం ఈద్గాలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఈ ర్యాలీ ప్రారంభమైంది.తిరంగా ర్యాలీగా పిలిస్తున్న ఈ ప్రదర్శనలో సుమారు 40 వేల మంది పాల్గొన్నట్లు సమాచారం. భారీ ర్యాలీతో పాతబస్తీ రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా ముస్లింలు నినాదాలు చేశారు. హిందూస్థాన్ జిందాబాద్ అంటూ హోరెత్తించారు. పలువురు జాతీయ నాయకుల ఫోటోలు కూడా ప్రదర్శించారు.
ర్యాలీ నేపథ్యంలో అటు పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ర్యాలీ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముస్లింల ర్యాలీతో పాతబస్తీకి దారితీసే రోడ్లలో ట్రాఫిక్ స్తంభించిపోయింది.