తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా కురిసిన వర్షాలతో పెరిగిన నీటి లభ్యత, ఎగువ కాళేశ్వరం ద్వారా తరలివచ్చిన గోదావరి జలాలతో శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పరీవాహకం ఉప్పొంగుతోంది. గత యాసంగి సీజన్లకు భిన్నంగా ఈ ఏడాది ఎస్సారెస్పీ–1, 2 కింద పూర్తి ఆయకట్టుకు నీరందించడంతో పాటు గరిష్టంగా 65 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగింది. మరో 20 నుంచి 25 టీఎంసీల నీటిని మార్చి చివరి వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండటంతో రైతులకు ఉపశమనం కలుగుతోంది. కొత్తగా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా వరద కాల్వ కింది చెరువులు నింపుతూ, ఆయకట్టుకు నీరిచ్చే ప్రక్రియ మొదలవడంతో జోష్ మరింత పెరిగింది.ఎస్సారెస్పీపైనే ఆధారపడిన వరద కాల్వకు సైతం పునరుజ్జీవ పథకం ద్వారా నీరందిస్తున్నారు. పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉన్న రాంపూర్, రాజేశ్వరరావుపేటలోని మోటార్లను ఆరంభించి కాల్వకు నీటిని విడుదల చేశారు. ఒక టీఎంసీ నీటిని పంపింగ్ చేసి 50 చెరువులను నింపనున్నారు. దీంతో పాటే వరద కాల్వ పరిధిలో బోరు మోటార్ల ద్వారా సాగు చేసిన ఆయకట్టుకు నీటి లభ్యత పెంచనున్నారు. ఎస్సారెస్పీలో ఏప్రిల్ నాటికి యాసంగి వినియోగంతో లభ్యత పడిపోగానే ఇదే ఎగువ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఖాళీ చేసి పునరుజ్జీవన పథకం ద్వారా మళ్లీ నింపనున్నారు. దీంతో మళ్లీ ఖరీఫ్‌లో సాగుకు నీటి కొరత లేకుండా చూసేలా ఇదివరకే ప్రణాళిక రచించారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )