హైదరాబాద్ లో కొత్తగా మరో 50 భారీస్థాయిలో థీమ్‌ పార్కుల ఏర్పాటు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, February 29, 2020

హైదరాబాద్ లో కొత్తగా మరో 50 భారీస్థాయిలో థీమ్‌ పార్కుల ఏర్పాటు

తెలంగాణ లోని గ్రేటర్‌ ఏర్పాటు అనంతరం అత్యంత భారీస్థాయిలో థీమ్‌ పార్కుల ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ రంగం సిద్ధం చేసింది . నగరంలోని వివిధ ప్రాంతాల్లో రూ.120కోట్ల వ్యయంతో 50 చోట్ల వీటిని ఏర్పాటు చేసేందుకు కార్యప్రణాళికను సిద్ధం చేశారు. 7.50 లక్షల చదరపు మీటర్లలో వీటిని నెలకొల్పాలని నిశ్చయించారు. ఇప్పటికే ఆయా పార్కుల్లో ఏర్పాటు చేసే థీమ్‌లను నిర్ధారించిన అధికారులు వాటి నమూనాలను రూపొందించే పనిలో ఉన్నారు. త్వరలోనే నమూనాలు సిద్ధం చేసి వచ్చే మార్చి నుంచి వరుసగా టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం జీహెచ్‌ఎంసీ ఆరు చోట్ల థీమ్‌ పార్కులను అందుబాటులోకి తెచ్చింది.  రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న విషయం విదితమే. 33 శాతం గ్రీన్‌ కవర్‌ సాధించడమే లక్ష్యంగా పెద్దఎత్తున మొక్కలు నాటుతుండగా, ఇదే క్రమంలో జీహెచ్‌ఎంసీ భారీస్థాయిలో థీమ్‌ పార్కులను ఏర్పాటుచేసేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో థీమ్‌లను నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీకి చెందిన ఖాళీ స్థలాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేనెల టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు చేపడుతామని అధికారులు తెలిపారు. జోన్లవారీగా పనులు చేపట్టనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ ఏడాది చివరికల్లా మొత్తం 50 పార్కులు దశలవారీగా అందుబాటులోకి వస్తాయని భరోసా ఇచ్చారు. మరోవైపు, జీహెచ్‌ఎంసీ నిధులతో ప్రతిఏటా చేపట్టే పార్కుల అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ఏర్పాటు తరువాత ఆరు ప్రాంతాల్లో థీమ్‌ పార్కులను ఏర్పాటు చేశారు. శేరిలింగంపల్లిలో డాగ్‌ పార్కు, పంచతంత్ర పార్కు, మలక్‌పేట్‌లో దివ్యాంగుల పార్కు, జూబ్లీహిల్స్‌లో ఫ్రూట్‌ పార్కు, మీరాలంలో లేక్‌ పార్కు, కిషన్‌బాగ్‌ పార్కు తదితర వాటిని ఏర్పాటు చేశారు. 


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )