భారత్ లో పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికాసేపట్లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నమస్తే ట్రంప్ ఈవెంట్ జరిగే మోతెరా స్టేడియం వరకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి మోతెరా స్టేడియం వరకు గుజరాత్ పోలీసు మరియు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మోహరించారు. ఇక మోతెరా స్టేడియం వెలుపల పోలీసులు గుర్రపు స్వారీతో పెట్రోలింగ్ నిర్వహించారు. సబర్మతి ఆశ్రమం వద్ద కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమం వద్ద యూఎస్ సెక్యూరిటీకి చెందిన స్నిఫర్ డాగ్స్ భద్రతలో ఉన్నాయి. సబర్మతి ఆశ్రమానికి ట్రంప్ దంపతులు సందర్శించనున్నారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మోతెరా స్టేడియం వరకు మొత్తం 16 చోట్ల తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేశారు. అమ్దావద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ చర్యలు చేపట్టింది. ప్రతి తాగునీటి సరఫరా కేంద్రం వద్ద ముగ్గురు సిబ్బందిని ఉంచింది. నమస్తే ట్రంప్ ఈవెంట్లో పాల్గొనేందుకు వచ్చే ప్రజలకు తాగునీటిని సరఫరా చేయనున్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )