..... మీడియా సంస్థ ప్రచురించిన వార్తలు పూర్తిగా అవాస్తవాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ వెల్లడి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, February 22, 2020

..... మీడియా సంస్థ ప్రచురించిన వార్తలు పూర్తిగా అవాస్తవాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ వెల్లడి

తెలంగాణ పోలీసు శాఖకు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉందని సీపీ గుర్తు చేశారు. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు లేకుండా చేశామన్నారు. నేర పరిశోధనలో ఇతర రాష్ర్టాకు కూడా సహకరిస్తున్నామని సీపీ అంజనీకుమార్‌ తెలియజేశారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను నా 30 ఏళ్ల సర్వీసులో ఎప్పుడూ చూడలేదని సీపీ అన్నారు. ఎన్నికల విధుల్లో ప్రభుత్వం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదనీ.. ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రభుత్వానికి అవార్డు కూడా వచ్చినట్లు సీపీ గుర్తు చేశారు. తెలంగాణలో ఎన్నికల విధుల్లో రాజకీయ జోక్యం జరగలేదని కేంద్ర సంస్థలు సైతం ప్రశంసించాయని ఈ సందర్భంగా సీపీ తెలిపారు. సభలకు అనుమతుల విషయంలో ఒక ప్రక్రియ ఉంటుందనీ.. ట్రాఫిక్‌, ఇంటిలెజెన్స్‌, ఇతర విభాగాలతో సమీక్షించిన తర్వాతే సభలకు అనుమతి లభిస్తుందని సీపీ అన్నారు. సభలకు అనుమతి విషయంలో పారదర్శకత పాటిస్తున్నామనీ.. మరోసారి బాధ్యతారహితంగా వార్తలు ప్రచురించవద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నానని సీపీ విన్నవించారు.పోలీసు వ్యవస్థపై అసత్య కథనాలు ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ మీడియాకు సూచించారు. ఓ పత్రికలో వచ్చిన దొంగలతో దోస్తీ అనే కథనం పోలీసు వ్యవస్థను మొత్తం అవమానపరిచేదిగా ఉందని సీపీ అంజనీ కుమార్‌ అన్నారు. మీడియా సమాజంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి మీడియా తప్పుడు వార్తలు ప్రచురించి, పోలీసులపై ప్రజలకున్న నమ్మకాన్ని చెడగొట్టదని ఆయన సూచించారు. కాగా, ఈ కథనాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు.. ఇవాళ నగరంలో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌, రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌.. సహా పోలీసు ఉన్నతాధికారులు సమావేశమై ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భగా సీపీ అంజనీ కుమార్‌ మాట్లాడుతూ.. సమాజంలో మీడియా పాత్ర చాలా గొప్పదన్నారు. మీడియాపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాధ్యత మీడియాపై ఉందనీ.. అలాంటి మీడియా అసత్య కథనాలు ప్రచురించడం బాధాకరమని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల నియామకాల్లో, బదిలీల్లో అవకతవకలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయనీ.. అవి పూర్తిగా అవాస్తవమైనవని కమిషనర్‌ స్పష్టం చేశారు. అక్రమాలు, అవకతవకలపై ఆధారాలు ఉంటే చూపించాలని ఆయన సవాలు చేశారు. కాగా, సదరు మీడియా సంస్థ ప్రచురించిన వార్తలు పూర్తిగా అవాస్తవాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. పోలీసు నియామకాల్లో, బదిలీల్లో పూర్తిగా పారదర్శకత పాటిస్తున్నట్లు ఆయన తెలిపారు. అసంకల్పిత వార్తలు రాస్తే కేసు ఫైల్‌ చేస్తామని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ హెచ్చరించారు. 
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )