అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చ సహా కొన్ని కీలక నిర్ణయాలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్లో మంత్రివర్గం సమావేశమైంది. సుమారు 6 గంటల పాటు కేబినెట్ భేటీ సాగింది. ఇందులో పల్లె ప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి నిర్వహణపై కీలక చర్చలు జరిగాయి. సీఏఏకు వ్యతిరేక తీర్మానం చేయాలని కూడా నిర్ణయించారు.
రాజీవ్ స్వగృహ ఇళ్ళను వేలం ద్వారా అమ్మేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడానికి చిత్రా రామచంద్రన్ అధ్యక్షతన రామకృష్ణారావు, అరవిందకుమార్ సభ్యులుగా అధికారుల కమిటీని నియమించారు. అభయహస్తం పథకం సమీక్ష బాధ్యతను మంత్రి హరీశ్, ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియాలకు అప్పగించింది. తెలంగాణ లోకాయుక్త చట్టంపై తీసుకొచ్చిన ఆర్డినెన్సును మంత్రి వర్గం ఆమోదించింది. అసెంబ్లీ బడ్టెట్ సమావేశాల్లో ఈ లోకాయుక్త బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదించుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )