ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన పీఆర్సీ నివేదిక వెంటనే తెప్పించుకొని వచ్చే నెలలో అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఉద్యోగ సంఘాల జేఏసీ విజ్ఞప్తి చేసింది. పీఆర్సీ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇక పీఆర్సీ రాదేమోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని జేఏసీ పేర్కొంది. బుధవారం సచివాలయంలో సోమేశ్‌కుమార్‌ను జేఏసీ చైర్మన్ కారెం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ వి.మమత, టీఎన్జీవో, టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, ఎ. సత్యనారాయణ, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి తదితరులు కలిశారు. పీఆర్సీని ఒక్క వేతన సవరణ కోసం వేయలేదని, ఉద్యోగుల అనేక విషయాలపై స్టడీ కోసం ఏర్పాటు చేశారన్నారు. ఆ స్టడీ పూర్తి కానందునే పొడిగించారన్నారు. పీఆర్సీ నివేదిక సిద్ధంగా ఉందని, నెల లోపల కమిషన్ రిపోర్ట్ అందిస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఒకవేళ పీఆర్సీ ప్రకటించకపోతే పోరాటం చేస్తామన్నారు. ఈహెచ్ఎస్ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కిందిస్థాయి ఉద్యోగులకు ఇవ్వాలని కోరామని వారు చెప్పారు. గడువు పెంపుపై ఆందోళన వద్దని సీఎస్ చెప్పారని వెల్లడించారు. వేతన సవరణకు ఈ గడువుతో సంబంధం లేదని చెప్పారన్నారు. పీఆర్సీ ఒక్కటే కాకుండా సర్వీసు రూల్స్ సవరణ, జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిలో కేడర్ స్ట్రెంత్ ఖరారుకు గడువును పెంచామని చెప్పారన్నారు. వేతన సవరణకు సంబంధించి నివేదికను వెంటనే తెప్పించుకుంటామని, సీఎం ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చుతుందని హామీ ఇచ్చారన్నారు. దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల జేఏసీ భేటీ అవుతుందని నేతలు వివరించారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )