తెలంగాణ రాష్ట్రంలోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ఈ ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి 24 వరకు దాదాపు 421 సూసైడ్ ఫోన్ కాల్స్ పోలీసులకు డైల్ 100 ద్వారా అందాయి. ఈ ఫోన్ కాల్స్‌ను అందుకున్న పోలీసులు 8 నిమిషాల వ్యవధిలో సంఘటనాస్థలానికి చేరుకొని పోలీసు సేవలను అందించారు. ఇందులో చాలా వరకూ పోలీసులు చివరి నిమిషంలో వెళ్లి సుమారు 50 మంది ప్రాణాలను కాపాడారు. ఆత్మహత్య చేసుకున్న తర్వాత వచ్చిన సమాచారంతో వెళ్లిన సిబ్బంది ఆ కుటుంబాల్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. చివరి నిమిషాల్లో ఉన్న బాధితులకు అధికారులు ఇటీవల సిబ్బందికి అందించిన వైద్య శిక్షణలో ఇచ్చిన చిట్కాలు చాలా ఉపయోగపడుతున్నాయి. ఇలా చేస్తున్న పోలీసులు ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తికి వైద్యుల నుంచి చికిత్స పొందేవరకూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, మానసికంగా కుంగిపోయిన వారు, భార్యాభర్తల గొడవలు, తల్లిదండ్రుల మందలింపులు, ఇలా వివిధ రకాల కారణాలతో చాలా మంది క్షణికావేశంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నప్పుడు ఆ క్షణం ఎవరు చెప్పినా కేకలు పెట్టినా పట్టించుకోరు. అలాంటి సమయంలో వారి కుటుంబ సభ్యులకు గుర్తుకు వచ్చేది పోలీసులే...జస్ట్ డయల్ 100కు ఫోన్ చేయగానే నిమిషాల్లో పోలీసులు చేరుకోవడంతో చాలా మంది ప్రాణాలు నిలబడుతున్నాయి. ఇందులో కొంత మంది నేరుగా పోలీసులకే ఫోన్ చేసి సార్ నా చావుకు ఎవరు కారణం కాదు నేను చనిపోతున్నానని ఫోన్ చేసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి సమాచారాన్ని పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా లొకేషన్‌ను తెలుసుకుని అత్యంత వేగంగా అక్కడికి చేరుకుని వారిని కాపాడిన సందర్భాలున్నాయి.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )