అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ సంకల్పించింది. దీనికోసం మాజీ సైనికులు, జీహెచ్ఎంసీ అధికారులతో జోన్లవారీగా కూల్చివేతల బృందాల ను రంగంలోకి దింపాలని అధికారులు నిర్ణయించారు. కూల్చాల్సిన భవనాల వివరాలు ఆయా బృందాలకు ముందుగా వెల్లడించకుండా గోప్యంగా ఉంచాలని, అంతేకాకుండా ఏ బృందం ఏ జోన్‌కు వెళ్లాలో కూడా కొద్దిసేపు ముందే వెల్లడించాలని నిశ్చయించారు.జీహెచ్ఎంసీకి వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధిక శాతం అక్రమ భవనాలకు సంబంధించినవే ఉంటున్నాయి. టౌన్‌ప్లానింగ్‌కు చెందిన కిందిస్థాయి సిబ్బంది అక్రమ నిర్మాణదారులతో మిలాఖత్ అవుతుండడంతో ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం ఉండడంలేదు. కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాలు ఇస్తున్న ఆదేశాలు సైతం అమలుకు నోచుకోవడంలేదు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ జోన్లవారీగా డెమోలిషన్ స్కాడ్లను రంగంలోకి దింపాలని నిర్ణయించింది. మున్సిపల్ చట్టం అమలుకోసం ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్(ఈవీడీఎం) ఆధ్వర్యంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో మాజీ సైనికులను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో కొందరికి టౌన్‌ప్లానింగ్ కోసం కేటాయించాలని ఆ విభాగం అధికారులు కోరుతున్నారు. టౌన్‌ప్లానింగ్ అధికారులు, మాజీ సైనికులతో బృందాలుగా ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీకి వివిధ మాధ్యమాల ద్వారా అక్రమ నిర్మాణాలపై వస్తున్న ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని నిశ్చయించారు. ఏ బృందం ఏ జోన్‌కు వెళ్తుందో అనేది ముందుగా వెల్లడించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వెళ్లే ముందే వారికి కూల్చాల్సిన భవనాల వివరాలు వెల్లడించాలని అధికారులు నిర్ణయించారు. జీహెచ్ఎంసీకి ఇప్పటి వరకు అందిన అక్రమ నిర్మాణ ఫిర్యాదులు దాదాపు 600 వరకూ పెండింగ్‌లో ఉండగా, అందులో సగం వరకు కోర్టు కేసుల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, మిగిలిన వాటిపై చర్యలు తీసుకునే అవకాశముంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )