కాగజ్‌నగర్‌లోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో శనివారం అర్దరాత్రి ఘోర ప్రమాదం - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, February 23, 2020

కాగజ్‌నగర్‌లోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో శనివారం అర్దరాత్రి ఘోర ప్రమాదం


తెలంగాణ రాష్ట్రంలోని కాగజ్‌నగర్‌లోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో శనివారం అర్దరాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. జెకె పేపర్ లిమిటెడ్ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడంతో కర్మాగారం పునురుద్దరణకు మార్గం సుగమం అయ్యింది. జెకె కంపెనీకి 10 సంవత్సరాల పాటు అన్ని రాయితీలు కల్పిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ జీవో 18ని విడుదల చేసింది. దీంతో పేపర్ మిల్లు పునఃప్రారంభానికి లైన్ క్లియరైంది.మిల్లులో మట్టిపెళ్లలు కూలి ముగ్గురు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. పేపర్ మిల్లులో కొత్తగా నిర్మిస్తున్న బాయిలర్‌ నిర్మాణ సాగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరో ఐదుగురు కార్మికులు మట్టి పెళ్లల కింద 50 మీటర్ల లోతులో చిక్కుకున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మట్టిలో కూరుకుపోయిన నలుగురు కార్మికులను బయటకు తీసి హాస్పిటల్‌కు తరలించారు. మిగతా వారిని రక్షించేందుకు సహాయ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఏఎస్పీ వైవీఎస్‌ సుదీంద్ర సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాయిలర్ నిర్మాణ పనులు కోసం కార్మికులంతా చెన్నై నుంచి వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఒక్కో షిఫ్ట్‌లో సగటున 12 మంది కార్మికులు పనిచేస్తుండగా ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఎంత మంది ఉన్నారనేది తెలియాల్సి ఉంది. ఘటనా స్థలంలో పోలీసులు, పేపర్ మిల్లు అధికారులు తప్ప మిగతా వారిని అనుమతించడం లేదు. ఈ పరిశ్రమ పునఃప్రారంభించాక ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. కాగా, 2014లో మూతపడిన సిర్పూర్ పేపర్ మిల్లును 2018 ఆగస్టులో పునరుద్దరణ పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రత్యక్షంగా 1,200 మంది పరోక్షంగా మరో 4,500 మంది ఈ మిల్లుపై ఆధారపడి జీవిస్తున్నారు. నాలుగు సంవత్సరాల నుంచి వీరంతా అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. పేపరు మిల్లు పునరుద్ధరణ కోసం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తీవ్రంగా కృషిచేశారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )