త్వరలో మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ మరమత్తు పనులు ప్రారంభం - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, February 24, 2020

త్వరలో మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ మరమత్తు పనులు ప్రారంభం

తెలంగాణ లోని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోస్తున్న ప్రభుత్వం మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీని వారంలో పూర్తిగా ఖాళీ చేయాలని నిర్ణయించింది. దిగువ బ్యారేజీలు, రిజర్వాయర్లలో నీటి లభ్యతను పెంచుతూ, మేడిగడ్డలో అవసరమైన మరమ్మతులు, ఇతర సాంకేతిక అంశాల పరిశీలనకు వీలుగా నీటినంతా దిగువకు పంపింగ్‌ చేయనుంది. ఇప్పటికే మేడిగడ్డ నుంచి నాలుగు టీఎంసీల మేర నీటిని పంపింగ్‌ చేయగా, ఆది వారం సైతం ఏడు పంపుల ద్వారా ఎత్తిపోతల ప్రక్రియ కొనసాగింది. ఈ నీరంతా దిగువ అన్నారం (సరస్వతి), అటు నుంచి సుందిళ్ల (పార్వతి) మీదుగా ఎల్లంపల్లికి చేరుతోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీటినంతా ఏప్రిల్‌లో ఖాళీ చేయాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయిం చింది. అయితే ప్రస్తుతం కాస్త ముందుగానే ఖాళీ చేయనున్నారు. రాష్ట్రంలో ఇసుక అవసరాలు పెరగడం, లభ్యత తగ్గిన నేపథ్యంలోనే మేడిగడ్డ బ్యారేజీని ఖాళీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ నుంచి మొత్తం సీజన్‌లో 45 టీఎంసీల నీటిని దిగువకు ఎత్తిపోయగా, ఈ వారం రోజుల నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. బ్యారేజీలో 16.12 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 10 టీఎంసీల మేర నీటి లభ్యత ఉండగా, కొన్నిరోజుల్లో నీటిని పూర్తిగా ఖాళీ చేయనున్నారు. ఆదివారం సైతం ఏడు మోటార్ల ద్వారా 15 వేల క్యూసెక్కుల మేర నీటిని దిగువ అన్నారం తరలించారు. ఇదే రీతిని పంపింగ్‌ కొనసాగిస్తే వారంలో మేడిగడ్డ ఖాళీ కానుంది. ఇక్కడ కనీసంగా కోటి క్యూబిక్‌ మీటర్ల మేర ఇసుక లభ్యత ఉంటుందని అంచనా. ఇప్పుడు ఖాళీ చేస్తేనే మార్చి నుంచి జూన్‌ ఆరంభం వరకు మూడు నెలలపాటు ఇసుకను తరలించవచ్చనే ప్రణాళికతో ప్రభుత్వం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఖాళీ చేసిన అనంతరం బ్యారేజీని పూర్తి స్థాయిలో పరిశీలన చేసి అవసరమైన మరమ్మతులు సైతం చేయనున్నారు. ఇక ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహాలతో అన్నారంలో లభ్యత పెరగడంతో అక్కడ 10.87 టీఎంసీలకు గానూ 10 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. దీంతో ఇక్కడి పంప్‌హౌస్‌లోని 8 మోటార్లతో నీటిని సుందిళ్లకు తరలిస్తున్నారు. సుందిళ్ల నుంచి మరో 4 పంపుల ద్వారా నీటిని ఎల్లంపల్లి చేరుస్తున్నారు. ఎల్లంపల్లిలో ప్రస్తుతం 20.18 టీఎంసీలకు గానూ 8.30 టీఎంసీల నీటి లభ్యత ఉంది. మేడిగడ్డ బ్యారేజీని ఖాళీ చేసిన అనంతరం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సైతం ఖాళీ చేయనున్నారు. ఈ నీటితో ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్‌ మానేరులో నిల్వలను పెంచనున్నారు. అనంతరం వీలునుబట్టి నీటిని పునరుజ్జీవం ద్వారా ఎస్సారెస్పీకి పంపనున్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )