మార్చి 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు నిరాహారదీక్ష దీక్షలకు పూనుకున్న ఉద్యోగ సంఘాలు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, March 03, 2020

మార్చి 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు నిరాహారదీక్ష దీక్షలకు పూనుకున్న ఉద్యోగ సంఘాలు

రాష్ట్రంలో రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మార్చి 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు నిరాహారదీక్ష చేయనున్నట్టు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. సోమవారం శాసనమండలి మీడియాపాయింట్‌ వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడారు. గత రెండేండ్లుగా సమస్యలు పరిష్కరించకుండా సీఎం కేసీఆర్‌ కాలయాపన చేస్తున్నారనీ, పది నెలలుగా తాను మౌఖికంగా, లిఖితపూర్వకంగా అపాయింట్‌మెంట్‌ కోసం కోరినా ఇవ్వలేదనీ, దీనితో నిరాహారదీక్ష చేస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద గల ధర్నాచౌక్‌లో మార్చి నాలుగున ఉదయం 9 గంటలకు ప్రారంభమై ఐదున సాయంత్రం ఆరు గంటలకు ముగిస్తుందని చెప్పారు. 10వ పీఆర్సీ గడువు 2018 జూన్‌ 30తో ముగిసిపోగా, అదే ఏడాది మే నెలలో ముగ్గురు సభ్యులతో పీఆర్సీ కమిషన్‌ను నియమించారనీ, జూన్‌ రెండవ తేదీ నుంచి ఐఆర్‌, ఆగస్టు 15 నుంచి తెలంగాణ రాష్ట్రంలో మొదటి పీఆర్సీని అమలు చేస్తామని ఇచ్చిన హామీని నేటికి అమలు చేయలేదన్నారు. పాత పీఆర్సీ గడువు ముగిసి 20 నెలలు గడిచాయనీ, వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏండ్లకు పెంచి ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కోరారు. కాంట్రాక్టు అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులను రెగ్యులర్‌ చేసేందుకు జారీ చేసిన జీ.వో.16 కోర్టులో ఉన్నందున, ఈ లోపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వారికి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌)ను రద్దు చేయాలనీ, దీనితో రాష్ట్ర ప్రభుత్వానికి గానీ, ఉద్యోగులు, ఉపాద్యాయులకు గాని ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల సర్వీస్‌ రూల్స్‌ సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ఆర్థిక భారం లేని ఉపాధ్యాయుల అంతర్జిల్లా బదిలీలకు అమలు చేయాలని కోరారు. పెరిగిన జనాభాకు తగినట్టు ప్రభుత్వశాఖల్లో ఉద్యోగులను పెంచాలనీ, ఉద్యోగుల పదోన్నతుల్లో జాప్యాన్ని నివారిం చాలని కోరారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )