నంబరు ప్లేటును స్పష్టంగా ఉంచకపోతే చైన్ స్నాచర్ గా కేసు నమోదు : వెల్లడించిన తెలంగాణ పోలీసు శాఖ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, March 12, 2020

నంబరు ప్లేటును స్పష్టంగా ఉంచకపోతే చైన్ స్నాచర్ గా కేసు నమోదు : వెల్లడించిన తెలంగాణ పోలీసు శాఖ

హైదరాబాద్‌లోని వాహనదారులకు పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ట్వీట్ చేశారు. వాహనదారులు నంబరు ప్లేటును స్పష్టంగా కనిపించేలా ఉంచకపోతే వారిని గొలుసు దొంగతనాలు చేసే వ్యక్తిగా (చైన్ స్నాచర్) అనుమానిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్విటర్ ద్వారా ప్రకటించారు. తమ వద్ద తప్పుడు నంబర్‌ ప్లేట్లతో తిరుగుతున్న దాదాపు 2 వేల వాహనాలకు సంబంధించిన రికార్డులు ఉన్నాయని అంజనీ కుమార్ ట్వీట్‌లో పేర్కొన్నారు. సరిగ్గా లేని నంబర్‌ ప్లేట్లతో తిరుగుతున్న 384 మంది వాహనదారులపై మంగళవారం కేసులు నమోదు చేసినట్లు సీపీ చెప్పారు. రోడ్లపై నంబర్‌ ప్లేట్లు సరిగ్గా లేకుండా కనపడితే వెంటనే ఫొటోను తీసి 9490616555 నెంబరుకు వాట్సాప్ చేయాలని నగర పౌరులను సీపీ ట్విట్టర్‌లో కోరారు. సాధారణంగా తరచూ రోడ్డు భద్రతా నిబంధనలు అతిక్రమించేవారు.. తమ నెంబరు ప్లేటు కనిపించకుండా ఒంపడం లేదా అక్షరాలు స్పష్టంగా కనిపించకుండా గీకడం వంటివి చేస్తుంటారు. మరికొందరు నకిలీ నంబరు ప్లేట్లతో తిరుగుతుంటారు. దీనివల్ల ట్రాఫిక్ పోలీస్ ఫోటో తీసినా చలానాలు తమకు రావని చాలా మంది ఇలా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు తాజా హెచ్చరిక చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Post Top Ad