కేటీఆర్ ఫామ్‌హౌస్ కేసు: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, March 11, 2020

కేటీఆర్ ఫామ్‌హౌస్ కేసు: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

శంకర్‌పల్లి కానోజీగూడ వద్ద కేటీఆర్ ఫామ్‌హౌస్‌పై డ్రోన్ కెమెరా ఎగరేశారనే ఆరోపణలపై రేవంత్ రెడ్డిపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఉప్పర్‌పల్లి న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించగా.. పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కూకట్‌పల్లి కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌పై మార్చి 11  విచారణ చేపట్టిన న్యాయస్థానం కొట్టేసింది.  చర్లపల్లి జైలులో రేవంత్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గండిపేట చెరువుకు వెళ్లే దారిలో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్‌ హౌస్‌ నిర్మించారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు పలువురు అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి సోమవారం (మార్చి 2) మధ్యాహ్నం ఫామ్ హౌస్ ముట్టడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు, మార్గమధ్యలో జన్వాడ వద్ద నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీ‍ఆర్‌ చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. 111 జీవోను అతిక్రమించి మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారని.. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. ఇదే సమయంలో కేటీఆర్ ఫార్మ్‌హౌస్‌ను కొంత మంది డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు.

Post Top Ad