ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, March 07, 2020

ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం కానుంది. ఈ సమావేశంలో 2020-21 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలపడంతోపాటు శాసనసభ, మండలిలో ఆర్డినెన్స్‌ల స్థానంలో ప్రవేశపెట్టనున్న బిల్లులకు ఈ భేటీలో ఆమోదం తెలపనున్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అనుమతిచ్చిన నేపథ్యంలో ప్రతి వర్సిటీకో చట్టంచేయాల్సి ఉంది. వీటిని మంత్రిమండలి ఆమోదించనుంది. రాష్ట్ర లోకాయుక్త చట్టసవరణ, ఎమ్మెల్యేలకు కార్పొరేషన్‌ పదవులను లాభదాయక జాబితా నుంచి తొలగించడంలాంటి బిల్లులను ప్రవేశపెట్టేందుకూ మంత్రిమండలి పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 20 వరకు జరగనున్నాయి. ఆదివారం ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈనెల 20 వరకు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఆదివారం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అనంతరం రెండు రోజులు సభకు సెలవు ప్రకటించింది. ఈనెల 15న ఆదివారం కావడంతో  సెలవుగా ప్రకటించింది. శనివారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది. మిగతా రోజుల్లో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. బడ్జెట్‌పై చర్చ అనంతరం ప్రభుత్వం ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా సభలో తీర్మానం ప్రవేశపెట్టనుంది. అయితే కాంగ్రెస్ అసెంబ్లీ పనిదినాలను పెంచాలని కోరడంతో ఈనెల 20న మరోసారి బీఏసీ సమావేశం కానుంది. బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆరు దశాబ్దాలపాటు అలుపెరగని పోరాటం చేసి.. తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్రం సాధించుకుందన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. తెలంగాణ   చాలా రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండటం గర్వకారణమన్నారు. రైతు బంధు పథకం యావత్‌ ప్రపంచానికి ఆదర్శమన్నారు. రైతులకు అండగా ఉండాలనే సంకల్పంతో..  ఎకరానికి 10 వేల చొప్పున రెండు విడతల్లో ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోందన్నారు. వ్యవసాయాభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న గొప్ప పథకాల్లో రైతు బంధు ఒకటని ఐక్యరాజ్య సమితి ప్రకటించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమన్నారు తమిళిసై. గవర్నర్ ప్రసంగంపై విపక్షాలు పెదవి విరిచాయి. రైతు బంధు సాయం అందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. మరోవైపు గవర్నర్ ప్రసంగం అద్భుతంగా ఉందని.. తెలంగాణలో జరుగుతోన్న అభివృద్ధిని కళ్లకు కట్టారని అధికార పార్టీ నేతలు అంటున్నారు.

Post Top Ad