కంటైన్మెంట్ జోన్లలో ప్రజల రాకపోకలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 18, 2020

కంటైన్మెంట్ జోన్లలో ప్రజల రాకపోకలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు

శుభ తెలంగాణ (18, ఏప్రిల్ , 2020) :  కంటైన్మెంట్ జోన్లలో ప్రజల రాకపోకలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ అర్బన్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్ర ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా నియంత్రణ చర్యలను సమీక్షించారు. ఇందులో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పమేలా సత్పతితో పాటు అర్బన్ జిల్లా అదనపు కలెక్టర్  దయానంద్, పోలీస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కంటైన్మెంట్ జోన్లలో స్వీయ నియంత్రణ అత్యంత ముఖ్య మన్నారు. ఈ దిశగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. జోన్లను పూర్తిగా నిర్బంధించాలని, నలువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయాలని,

అదనపు పోలీస్ బలగాలను మోహరించాలని, మొబైల్ మార్కెట్ బృందాల ద్వారా నిత్యావసరాలు అందించాలని సూచించారు. కంటైన్మెంట్ జోన్లలో ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య పరీక్షలు జరపాలని ఆదేశించారు. సోడియం హైపోక్లోరైట్  సొల్యూషన్ పిచికారీ చేయించాలన్నారు. కరోనా వైరస్ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇందుకోసం తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలలో పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయించాలని సూచించారు.వైద్య బృందాలు ఆరోగ్య  పరీక్షలు జరపడంతో పాటు అనుమానిత కేసులను వెంటనే క్వారెంటైన్ కేంద్రాలకు తరలించాలని మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు.