తెలంగాణ లో రేపటి నుండే రెండో విడత రేషన్ , నగదు పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 30, 2020

తెలంగాణ లో రేపటి నుండే రెండో విడత రేషన్ , నగదు పంపిణీ


శుభ తెలంగాణ  (హైదరాబాద్‌) : కరోనా వైరస్‌ నిర్మూలన కోసం ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో ఉపాధి కోల్పోయిన నిరుపేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత బియ్యం పంపిణీ శుక్రవారం నుంచి ప్రారంభించనుంది. గత నెలలో ఆహార భద్రత కార్డు ఉన్న కుటుంబంలో ఒక్కొక్కరికి 12కిలోల చొప్పున బియ్యం, ఒక్కోకార్డుపై 1500 రూపాయల ఆర్ధికసాయం అందించింది. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 87.55 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్న కుటుంబంలో ఒక్కొక్కరికి 12కిలోల చొప్పున బియ్యం పంపిణీ ప్రారంభించనున్నారు. అలాగే నిజామాబాద్‌, నల్లగొండ, వరంగల్‌ రూరల్‌, మెదక్‌ జిల్లాల్లో ప్రతికార్డుదారుడికి కిలో కందిపప్పు కూడా ఉచితంగా పంపిణీ చేయబోతున్నట్టు పౌరసరఫరాలశాఖ అధికారులు వెల్లడించారు.

నేషనల్‌ అగ్రికల్చర్‌ కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (నాఫెడ్‌) ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక నెల రాష్ర్టానికి అవసరమైన 8,754 మెట్రిక్‌టన్నుల కందిపప్పు రావాల్సి ఉండగా , నాఫెడ్‌ ఇప్పటి వరకూ 3,233 మెట్రిక్‌టన్నులు మాత్రమే సరఫరా చేసింది. దీంతో ముందుగా మే1 నుంచి నాలుగు జిల్లాల్లో మాత్రమే సరఫరాచేస్తున్నట్టు తెలిపారు. నాఫెడ్‌ సరఫరా చేసే దానికి అనుగుణంగా రాష్ట్రంలోని మిగిలిన 29 జిల్లాల్లో 15వ తేదీ తర్వాత కందిపప్పు పంపిణీ చేస్తామని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మే నెలకు సంబంధించి కూడా ప్రతి కార్డుదారుడికి 1500 రూపాయలు బ్యాంకులో లేదా పోస్ట్‌ ఆఫీస్‌ ఖాతాలో జమ చేసే కార్యక్రమాన్ని మే 2వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.