భారత్ పంపిన మందులు పనికిరావు : మెడికల్ ప్రీప్రింట్ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 22, 2020

భారత్ పంపిన మందులు పనికిరావు : మెడికల్ ప్రీప్రింట్

శుభ తెలంగాణ (22,ఏప్రిల్,2020) : కరోనా వైరస్ చికిత్స కోసం ఉపయోగిస్తున్న మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ వల్ల పెద్దగా ఉపయోగం లేదని కొందరు వారి అధ్యయనాల ద్వారా వెల్లడించారు. ఈ అధ్యయనంలో వెల్లడైన విషయాలు అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాయి. ఈ ఔషధాన్ని ఉపయోగించడం వల్ల ఫలితం లేకపోగా ప్రాణనష్టం కూడా వాటిల్లుతున్నట్టు అధ్యయనం పేర్కొన్న వివరాలను మెడికల్ ప్రీప్రింట్ సైట్‌లో పొందుపరిచారు. కరోనాను ఎదుర్కొనేందుకు ఈ మందు బాగా పనిచేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇటీవల పలుమార్లు పేర్కొన్నారు. అయితే, తాజా అధ్యయనంలో వెల్లడైన విషయాలతో ఈ ఔషధంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో కరోనా బారినపడి మరణించిన వారు, డిశ్చార్జ్ అయిన 368 సీనియర్ సిటిజన్ల వైద్య రికార్డులను పరిశీలించిన అనంతరం అధ్యయనకారులు ఈ విషయాన్ని వెల్లడించారు.

కరోనా బారినపడి హైడ్రక్సీక్లోరోక్విన్‌ను తీసుకున్న రోగుల్లో మరణాల రేటు 28 శాతం ఉండగా, యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్‌తో కలిపి ఈ మందును తీసుకున్న వారిలో మరణాల రేటు 22 శాతంగా ఉన్నట్టు తేలింది. అయితే, ప్రామాణిక వైద్యం పొందిన వారిలో మాత్రం మరణాల రేటు 11 శాతం మాత్రమే ఉండడం గమనార్హం. ఫ్రెంచ్ శాస్త్రవేత్త దీదీర్ రౌల్ట్ కూడా ఈ డ్రగ్ కాంబినేషన్ వైరస్‌పై సమర్థంగా పోరాడుతుందని చెప్పడంతో ఈ ఔషధంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. అయితే, అధ్యయనం కోసం ఎంచుకున్న రోగులందరూ సీనియర్ సిటిజన్లు కావడం, వారు అప్పటికే మధుమేహం, రక్తపోటు వంటి జబ్బులతో బాధపడుతుండడంతో ఈ అధ్యయనంపై కంగారుపడాల్సిందేమీ లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ విధంగా భారత్ పంపిన మందులు పనికి రావు అని కొందరు విదేశీ శాస్త్రవేత్తలు  పరోక్షంగా వెల్లడిస్తున్నారు .