ఎల్బీ నగర్ లో వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి, 14వ అంతస్తు నుంచి పడిపోయింది - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, May 27, 2020

ఎల్బీ నగర్ లో వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి, 14వ అంతస్తు నుంచి పడిపోయింది

హైదరాబాద్ ఎల్బీనగర్ లో విషాదం చోటు చేసుకుంది. వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని సాహితిగా గుర్తించారు. సాహితి ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. సాగర్ రింగ్ రోడ్‌లో ఉన్న అలేఖ్య టవర్స్‌లోని 14వ అంతస్తులో నివసిస్తున్న రఘురాం, పద్మల కూతురు సాహితి. ఉస్మానియా ప్రభుత్వ డెంటల్ కాలేజీలో (బీడీఎస్) నాలుగో సంవత్సరం చదువుతోంది. 
14వ అంతస్తు నుంచి:
లాక్ డౌన్ తో సాహితి ఇంట్లోనే ఉంటోంది. కాగా, మంగళవారం(మే 26,2020) మధ్యాహ్నం సమయంలో తన ఇంట్లో బాల్కనీలో ఉన్న గ్రిల్స్ తొలగించి పైనుంచి దూకింది. అంత ఎత్తు నుంచి కిందకు పడటంతో తీవ్ర గాయాలతో స్పాట్ లోనే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
సాహితిది ఆత్మహత్య అంటున్న తండ్రి:
సాహితి మృతి స్థానికంగా కలకలం రేపింది. సాహితి ఆత్మహత్య కారణాలపై పోలీసులు ఆరా తీశారు. ఎంబీబీఎస్ సీటు రాకపోవడంతో.. చాలాకాలంగా మనోవేదనకు గురైన సాహితి ఆత్మహత్య చేసుకున్నట్టు తండ్రి రఘురామ్ చెబుతున్నా, పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశారు.
హత్యా? ఆత్మహత్యా?
అయితే బాల్కనీకి ఉన్న గ్రిల్స్ తొలగించి ఉండడంతో సాహితీ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రిల్స్ తనే తొలగించి దూకేసి ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. సాహితి మృతితో ఆ ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.