తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు .. జీహెచ్ఎంసీ పరిధిలోనే 82కొత్త కేసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 30, 2020

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు .. జీహెచ్ఎంసీ పరిధిలోనే 82కొత్త కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్న తీరు తెలంగాణ వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. ఒక శుక్రవారం రోజు తెలంగాణ రాష్ట్రంలో రికార్డ్ లెవల్లో 169 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ కేసులలో అత్యధికంగా జిహెచ్ఎంసి పరిధిలోనే నమోదయ్యాయి.
ఒక హైదరాబాద్ పరిధిలోనే 82 కేసులు నమోదయ్యాయి అంటే హైదరాబాద్ లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తుంది అన్నది అర్థమవుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసులు చూస్తే 2425 కేసులు నమోదు కాగా ఇప్పటివరకు 973 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి .1381 కేసులు కరోనా బారి నుండి బయటపడి డిశ్చార్జ్ కాగా 71 మంది మృతి చెందారు. నిన్న తాజాగా నమోదైన కేసులలో జీహెచ్ఎంసీ పరిధిలోని 82 కేసులు కాక, రంగారెడ్డి జిల్లాలో 14, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రెండు కేసుల చొప్పున న‌మోద‌య్యాయి. అంతేకాక, విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 64 కొత్త కేసులను శుక్రవారమే గుర్తించడం గ‌మనార్హం.
మరో ఐదుగురు వలస కార్మికులకు కూడా కరోనా వైరస్ సోకినట్లు గా అధికారులు నిర్ధారించారు. ఇక నిన్న ఒక్కరోజే మరో నలుగురు కరోనాతో చనిపోయినట్లుగా వైద్య‌,ఆరోగ్య‌శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 71కి చేరింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల ని చూస్తే 1,73,491 మంది ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డారు . మహారాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఏ మాత్రం తగ్గటం లేదు. దేశంలోనే అత్యధికంగా ఈ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది.