సర్కారు రెట్టింపు సాయం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 24, 2020

సర్కారు రెట్టింపు సాయం..


లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చేనేత కార్మికులను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేతన్నకు చేయూత పొదుపు పథకంలో లాక్‌ఇన్‌ పీరియడ్‌ ముగియకున్నా, డబ్బు తిరిగి తీసుకొనేందుకు అనుమతివ్వనున్నట్టు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఈ నిర్ణయంతో చేనేత కార్మికులకు తక్షణం రూ.93 కోట్లు చేతికందుతాయి. ఇందులో కార్మికుల పొదుపు సొమ్ము రూ.31కోట్లు ఉండగా, ప్రభుత్వ సాయం రూ.62 కోట్లు ఉన్నది. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో, దేశంలో వ్యాపారాలు స్తంభించటంతో చేనేత కార్మికులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. దాంతో నేతన్నలవద్ద నగదును పెంచేందుకు ఈ పథకం ద్వారా నగదుసాయం అందిస్తున్నట్టు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. శనివారం టీఎస్‌ఐఐసీ కార్యాలయంలో చేనేత, జౌళిశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. నేతన్నకు చేయూత పొదుపు  పథకంలో కార్మికుడు చేరిననాటి నుంచి మూడేండ్లు లాక్‌ఇన్‌ పీరియడ్‌ ఉంటుందని, అయితే ప్రస్తుతమున్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే నగదు అందుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు. దాంతో నేతన్నలకు రూ.93 కోట్లు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.  

‘ఈ పథకంలో చేరిన చేనేతకార్మికుడు ఎనిమిదిశాతం (నెలకు రూ.1200) తన వాటా జమ చేస్తే, దానికి రెట్టింపు 16 శాతం (నెలకు రూ.2400) ప్రభుత్వ వాటాగా జమ చేస్తున్నది. పవర్‌లూం కార్మికుల ఎనిమిదిశాతం వాటాకు సమానంగా మరో ఎనిమిదిశాతం ప్రభుత్వం జమ చేస్తున్నది. ఈ పథకానికి మూడేండ్లు లాకిన్‌ పీరియడ్‌ ఉంది. ఇప్పటివరకు కార్మికులు సుమారు రూ. 31 కోట్లు జమ చేస్తే ప్రభుత్వవాటాగా రూ.62 కోట్లు జమచేసింది. లాక్‌ఇన్‌ పీరియడ్‌ నుంచి మినహాయించటం ద్వారా ఈ పథకంలో భాగస్వాములైన 26,500 మంది నేతన్నలకు తక్షణమే ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు నగదు అందుతుంది’ అని కేటీఆర్‌ తెలిపారు. దీంతోపాటు సొసైటీల పరిధిలోని 2337 మంది కార్మికులకు గతంలో ముగిసిన పొదుపు పథకం డబ్బు మరో రూ.1.18 కోట్లు నేత కార్మికులకు అందించనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.