ఎండలతో అల్లాడుతున్న నగర వాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. 2020, మే 25, 26వ తేదీల్లో గ్రేటర్ హైదరాబాద్ లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు. మరోవైపు నగరంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. 2020, మే 23వ తేదీ శనివారం ఎండలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో జనాలు అల్లాడిపోయారు.
ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు గరిష్టంగా 42.8, కనిష్ట ఉష్ణోగ్రత 26.5 డిగ్రీల సెల్సియస్ నమోదైందని తెలిపారు. గాలిలో తేమ 14 శాతంగా నమోదైందన్నారు. తీవ్రమైన ఉక్కపోతతో జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఈరోజు కూడా ఏపీ, తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. ఎండలకు వడగాలులు తోడవ్వడంతో ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావడం లేదు.