తెలంగాణలో ఎత్తయిన ప్రదేశానికి చేరనున్న గోదావరి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, May 27, 2020

తెలంగాణలో ఎత్తయిన ప్రదేశానికి చేరనున్న గోదావరి

రాష్ట్ర సరిహద్దులో సముద్రమట్టానికి వందమీటర్లలోపే పారే గోదారమ్మ గరిష్ఠ ఎత్తుకు చేరే కీలక ఘట్టానికి ముహూర్తం ఖరారయ్యింది. భువి నుంచి అరకిలోమీటరుకుపైగా ఎత్తులోకి ఎగిరిదుంకేందుకు సిద్ధమయ్యింది. కాలువలు, చెరువులు, రిజర్వాయర్లను నిండుకుండలా మారుస్తూ వందల కిలోమీటర్లు ప్రయాణించిన కాళేశ్వరం జలాలు ఈ నెల 29న 618 మీటర్ల ఎత్తులోని కొండపోచమ్మ సిగలో కొలువుతీరనున్నాయి. సీఎం కేసీఆర్‌ శుక్రవారం ఉదయం 11.30 గంటలకు మర్కూక్‌ పంప్‌హౌజ్‌లో రెండు మోటర్లను ఆన్‌చేసి కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా త్రిదండి చినజీయర్‌స్వామి యజ్ఞం నిర్వహించి ఆశీర్వచనం అందజేస్తారు. ఈ చారిత్రక ఘట్టానికి అధికారయంత్రాంగం అన్నిఏర్పాట్లు చేస్తున్నది. సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గం పరిధిలోని మర్కూక్‌ -పాములపర్తి గ్రామాల సమీపంలో 15 టీఎంసీల సామర్థ్యంతో ప్రభుత్వం కొండపోచమ్మ రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టింది. సిద్దిపేట జిల్లాలోని శ్రీరంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి 16 కిలోమీటర్ల సొరంగం ద్వారా తుక్కాపూర్‌ (మల్లన్నసాగర్‌) పంప్‌హౌజ్‌కు చేరుకున్న గోదావరి జలాలు అక్కడ ఎత్తిపోయడం ద్వారా అక్కారం పంప్‌హౌజ్‌కు, అక్కడినుంచి మర్కూక్‌ పంపుహౌజ్‌కు వచ్చిచేరాయి. మర్కూక్‌లో మరోసారి ఎత్తిపోయడం ద్వారా కొండపోచమ్మ రిజర్వాయర్‌కు చేరనున్నాయి.

రంగనాయక్‌సాగర్‌ నుంచి మూడుదశల్లో

రంగనాయక్‌సాగర్‌ జలాశయం నుంచి మూడుదశల్లో ఎత్తిపోయడం ద్వారా గోదావరి జలాలు కొండపోచమ్మకు చేరుతాయి. తుక్కాపూర్‌ (మల్లన్నసాగర్‌) సర్జ్‌పూల్‌ పంప్‌హౌజ్‌లో 43 మెగావాట్ల సామర్థ్యంతో ఎనిమిది మోటర్లను ఏర్పాటుచేయగా.. రెండు మోటర్ల ద్వారా జలాలను ఎత్తిపోశారు. ఇక్కడి డెలివరీ సిస్టర్న్‌ నుంచి మల్లన్నసాగర్‌ కుడి, ఎడమకాలువలకు నీళ్లు వెళ్తాయి. కుడికాలువ ద్వారా దుబ్బాక, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఆయకట్టుకు నీళ్లందుతాయి. ప్రస్తుతం ఆ కాలువ పనులు కొనసాగుతున్నాయి. ఎడమకాల్వ ద్వారా 11,500 క్యూసెక్కుల నీరు తుక్కాపూర్‌ పంపుహౌజ్‌ నుంచి 7.9 కి.మీ వద్దఉన్న కొడకండ్ల ఫోర్‌బేకు చేరుకుంటాయి.