ఒకరు ముస్లిం రాష్ట్రంగా.. ఇంకొకరు క్రైస్తవ రాజ్యంగా.. - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, May 25, 2020

ఒకరు ముస్లిం రాష్ట్రంగా.. ఇంకొకరు క్రైస్తవ రాజ్యంగా..

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై భారతీయ జనతా పార్టీ నిప్పులు కురిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నిరర్థక ఆస్తుల విక్రయాల వ్యవహారంలో జగన్ సర్కార్‌పై కత్తులు నూరుతోన్న బీజేపీ ఏపీ నాయకులకు తెలంగాణ రాష్ట్రశాఖ నాయకులు కూడా తోడయ్యారు. టీటీడీ ఆస్తుల విక్రయాన్ని అడ్డుగా పెట్టుకుని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఘాటు విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
ఇద్దరు ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల నుంచి హిందువులను తరిమికొట్టాలనే కృతనిశ్చయంతో పని చేస్తున్నట్లు కనిపిస్తోందని తెలంగాణ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్ విమర్శించారు. హిందువులు లేని రాష్ట్రాలుగా మార్చడానికి కేసీఆర్, వైఎస్ జగన్ కష్టపడుతున్నారని ఆరోపించారు. తెలంగాణను ముస్లిం రాష్ట్రంగా మార్చడానికి కేసీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారని, అదే సమయంలో ఏపీని క్రైస్తవుల రాజ్యంగా తీర్చిదిద్దాడానికి వైఎస్ జగన్ కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు.
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయ కీచకుల్లా తయారయ్యారని బండి సంజయ్ విమర్శించారు. వారి నుంచి హిందూ ఆలయాలను పరిరక్షించుకుంటామని అన్నారు. హిందువుల శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలియజేస్తామని హెచ్చరించారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు హిందుత్వ సత్తాను చూపిస్తామని అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఏపీలో వైఎస్ జగన్‌ను రాజకీయంగా సమాధి చేస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.