తెలంగాణలోకి ప్రవేశించిన మిడతల దండు.. ఈ చిట్కాతో చెక్! - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, May 29, 2020

తెలంగాణలోకి ప్రవేశించిన మిడతల దండు.. ఈ చిట్కాతో చెక్!

మిడతల దండు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. మహారాష్ట్ర మీదుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి మిడతలు రాష్ట్రంలోకి వచ్చాయని తెలుస్తోంది. ఇవి ఏ క్షణమైనా పంటల మీద వాలిపోయే ప్రమాదం ఉంది. కుమురం భీం జిల్లా తిర్యాణీ, సిర్పూర్ నియోజకవర్గంలోని ప్రాణహిత ప్రాంతాల్లో మిడతల దండు తిష్ట వేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే వరికోతలు పూర్తి కావడంతో పంట నష్టం తప్పినట్లే. కానీ కూరగాయలు, పండ్ల తోటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 వేల ఎకరాల్లో కూరగాయలను సాగు చేస్తుండగా.. 30 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ మిడతాలు తీర్యాణి అటవీ ప్రాంతంలో ఉన్నాయని.. అవి ఏ సమయంలోనైనా పంట చేల మీద దాడి చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. మిడతల దండు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

మిడతల దండును ఎదుర్కోవడానికి వ్యవసాయ, అటవీ, అగ్నిమాపక శాఖల సిబ్బందిని సమాయత్తం అవుతున్నారు. మిడతలు వాలితే గుడ్లు పెట్టే ప్రమాదం ఉండటంతో.. స్ప్రేయర్లు, ఫైరింజన్లను ఉపయోగించి పెద్ద ఎత్తున రసాయనాలు, వేప నూనెను పిచికారీ చేయనున్నారు. కూరగాయల తోటలపై బంక మన్ను కలిపిన నీటిని పిచికారీ చేస్తే ఫలితం ఉంటుందని, మిడతలు పంటకు నష్టం కలిగించవని సాగులో అనుభవం ఉన్నవారు చెబుతున్నారు. డీజే సౌండ్ వల్ల కూడా మిడతలు పంటలపై వాలవని చెబుతున్నారు.