హైదరాబాద్‌లో కరోనా సామూహిక వ్యాప్తిపై అనుమానాలు.. రంగంలోకి ఐసీఎంఆర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 30, 2020

హైదరాబాద్‌లో కరోనా సామూహిక వ్యాప్తిపై అనుమానాలు.. రంగంలోకి ఐసీఎంఆర్

హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ అదుపులోకి రావడం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ఒకరి నుంచి మరొకరికి వేగంగా ఇన్ఫెక్షన్ సోకుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో.. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా సామూహిక వ్యాప్తి దశకు చేరిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఐదు ప్రాంతాల్లో కరోనా సామూహిక వ్యాప్తి దశకు చేరిందా లేదా అనే విషయం తేల్చడం కోసం ఐసీఎంఆర్ ఇంటింటి సర్వే చేపడుతోంది. హైదరాబాద్‌లోని ఆదిభట్ల, చందానగర్, మియాపూర్, బాలాపూర్, టప్పాచబుత్రా ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో ఐసీఎంఆర్ సర్వే నిర్వహిస్తోంది.

ఈ ప్రాంతాల్లోని ప్రజల నుంచి ర్యాండమ్‌గా శాంపిళ్లను సేకరించి టెస్టులు చేస్తున్నారు. మొత్తం 500 శాంపిళ్లను సేకరిస్తారు. కుటుంబంలో ఒకరి దగ్గర్నుంచి శాంపిళ్లను సేకరిస్తారు. 18 ఏళ్లు పైబడిన వారి దగ్గర్నుంచి మాత్రమే శాంపిళ్లను సేకరిస్తారు. ఒక్కో ప్రాంతంలో రెండు బృందాల చొప్పున మొత్తం పది టీంలు కరోనా కేసులు, వాటి లక్షణాలు.. లక్షణాలు లేకుండా బయటపడుతున్న కేసులపై సర్వే చేస్తారు. ఈ సర్వే నివేదికను ఐసీఎంఆర్.. కేంద్ర ఆరోగ్య శాఖకు అందిస్తుంది.

బ్లడ్ శాంపిళ్ల నుంచి సీరంను వేరు చేసి.. చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్‌క్యూలోసిస్‌కు పంపిస్తారు. పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డెవలప్ చేసిన ఎలీసా టెస్ట్ కిట్‌ను చెన్నై సంస్థ ఉపయోగిస్తుంది. శాంపిళ్లలో కరోనా యాంటీ బాడీలు కనిపిస్తే.. సామూహిక వ్యాప్తికి దారి తీసింది.. వైరస్‌ను తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి ప్రజల్లో ఏర్పడుతోందని భావిస్తామని అధికారులు తెలిపారు.