‘వలస’తో పొంచి ఉన్న ముప్పు! - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, May 25, 2020

‘వలస’తో పొంచి ఉన్న ముప్పు!

తెలంగాణ జిల్లాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా జిల్లాల్లో కేసులు నమోదు కాకపోయినప్పటికీ.. వేరే రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు తిరిగొస్తుండటంతో.. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. యాదాద్రి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో 20 రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. శనివారం వరకు 137 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. ఈ మూడు జిల్లాల్లోనే 94 కేసులు నమోదు కావడం గమనార్హం.
గత కొద్ది వారాల్లో నల్గొండ, సిరిసిల్ల, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, జనగాం జిల్లాలకు వేలాది మంది వలస జీవులు తిరిగొచ్చారు. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు జాగ్రత్తగా ఉంటున్నారు.

యాదాద్రి జిల్లాలో 8 లక్షల జనాభా ఉండగా.. జగిత్యాలలో 10 లక్షలు, మంచిర్యాలలో 9 లక్షల మంది చొప్పున నివసిస్తున్నారు. ఈ మూడు జిల్లాల్లో గత పది రోజులుగా 90 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి తిరిగొస్తున్న వారి వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
మే 1 నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు 2300 మంది వలస జీవులు తిరిగొచ్చారు. ఈ జిల్లాలో 40 రోజుల వరకు కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. కానీ వలస వెళ్లిన వారు తిరిగి వస్తుండటంతో... ఈ జిల్లాల్లో కోవిడ్ బాధితుల సంఖ్య 37కు చేరింది. ఆత్మకూరు, నారాయణపూర్, వలిగొండ మండలాల్లో ఈ కేసులు నమోదయ్యాయి.

జగిత్యాల జిల్లాలో వలస వెళ్లి తిరిగొచ్చిన వారి వల్ల 30 కేసులు నమోదయ్యాయి. మే 1 నుంచి ఇప్పటి వరకూ ముంబై నుంచి 5200 మంది తిరిగొచ్చారు. 800 మంది ధర్మపురి మండలానికి రాగా.. 470 మంది వెలగటూరు మండలానికి, 426 మంది గొల్లపల్లి మండలానికి వచ్చారు. ఈ జిల్లాల్లో 32 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 4 తబ్లీగీ జమాత్‌కు సంబంధించినవి కాగా.. 28 కేసులు ముంబై నుంచి తిరిగొచ్చిన వారి వల్ల వచ్చాయి. శుక్రవారం ఒక్క రోజే ఈ జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి.