రిటైర్డ్ ఐఏఎస్ ఉమాపతి రావు కన్నుమూత.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 28, 2020

రిటైర్డ్ ఐఏఎస్ ఉమాపతి రావు కన్నుమూత..

విశ్రాంత ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతి రావు (92) కన్నుమూశారు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో బుధవారం తుది శ్వాస విడిచారు. ఆయన స్వస్థలం కామారెడ్డి జిల్లా దోమకొండ. గురువారం దోమకొండలో ఉమాపతి రావు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. దోమకొండ కోట వంశీయుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ఉమాపతి రావు పలు జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశారు. ఈయన గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి తొలి ఈవోగానూ పని చేశారు.

దోమకొండ సంస్థానాన్ని ఉమాపతి రావు పూర్వీకులు 400 ఏళ్ల పాటు పాలించారు. ఉమాపతి రావుకు అనిల్ కుమార్ ఒక్కడే కుమారుడు ఉన్నారు. సినీ నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఉమాపతిరావుకి మనవరాలు. 1928లో జన్మించిన ఈయన నీతి నిజాయతీతో గొప్ప వ్యక్తిగా జీవించారని మనుమరాలు ఉపాసన పేర్కొన్నారు. ఉమాపతి రావు ఉర్దూ భాషలోనూ కవితలు రాసేవారని ఆమె తెలిపారు. గొప్ప విలువలతో కూడిన తన తాతయ్య చనిపోవడం పట్ల ఉపాసన ట్విటర్ వేదికగా సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

సీఎం సంతాపం
విశ్రాంత ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతి రావు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్య, సాంఘిక సంక్షేమశాఖలకు ఆయన విశేషంగా సేవలందించారని కొనియాడారు. ఉమాపతిరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.