ప్రపంచమే ఆశ్చర్యపడేలా వారంలో రైతులకు తీపి కబురు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 30, 2020

ప్రపంచమే ఆశ్చర్యపడేలా వారంలో రైతులకు తీపి కబురు

ప్రపంచమే ఆశ్చర్యపోయేలా రాష్ట్ర రైతాంగానికి వారం రోజుల్లో తీపి కబురు చెప్పనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకుని ఈ విషయం ప్రకటించబోతున్నానని తెలిపారు. పల్లేర్లు మొలిచిన తెలంగాణ ఇప్పుడు పసిడి పంటలతో కళకళలాడుతున్నదని, ధాన్యపు రాశుల తెలంగాణగా మారిపోయిందని సంతోషం వ్యక్తంచేశారు. పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే.. అని పాడుకున్న రోజుల నుంచి కోట్ల రూపాయల పంటలు పండించే స్థాయికి తెలంగాణ ఎదిగిందని చెప్పారు. తెలంగాణ అమరులను స్మరించుకున్న ముఖ్యమంత్రి.. వారి త్యాగాల ఫలమే అద్భుత తెలంగాణ కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ పదింతలు బాగుపడే విధంగా కండ్లముందు కనిపిస్తున్నదని చెప్తూ.. దేశానికి మన రైతులు ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాలోని మర్కూక్‌ పంప్‌హౌజ్‌లో మోటర్లను ఆన్‌చేసి.. అత్యంత ఎత్తయిన కొండపోచమ్మసాగర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోతను ముఖ్యమంత్రి ప్రారంభించారు. చినజీయర్‌స్వామితో కలిసి రిజర్వాయర్‌ వద్ద గంగమ్మ తల్లికి చీరెసారె సమర్పించి, పూజలు నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

ప్రపంచమే ఆశ్చర్యపోతుంది

ప్రపంచమే ఆశ్చర్యపడేలా రైతాంగానికి త్వరలో తీపి కబురు అందిస్తా. ప్రపంచం, ఇండియాలో ఎక్కడా లేని శుభవార్త అది. కొంత సస్పెన్స్‌ పెడ్తం. త్వరలోనే ఆ కబురు చెప్పబోతున్నం. ఫైనాన్స్‌ పరిస్థితి కూడా చూసుకున్నం. దేశమే అశ్చర్యపడేలా, అడ్డం పడేలా ఆ వార్త ఉండబోతున్నది. తెలంగాణ రైతాంగం ఆదర్శం గా తయారుకావాలి. తెలంగాణ రాష్ట్రం కోసం చావునోట్ల తలపెట్టిన. వెంటవచ్చిన ఉద్యమకారులు అమరులయ్యారు. వారిని స్మరించుకుంటున్నం. వారి త్యాగాలఫలమే అద్భుత తెలంగాణ కావాలి. పదింతలు బాగుపడేలా కండ్ల ముందు కనిపిస్తున్నది. దేశానికి మనం ఆదర్శం కావాలి. కేసీఆర్‌ మొండిపట్టు పడుతడు. తెలంగాణ రైతాంగం ఆధునిక, ఆదర్శరైతాంగం కావా లి. అద్భుతాలు సృష్టించాలి. ఫలితాలు రావాలి. అన్ని కులాలు, మతాలు సంతోషంగా బతుకాలి.