విద్యార్థులే టీచర్లయ్యారు..! అనర్గళంగా పాఠాలు బోధిస్తున్నారు.. భయం.. బెరుకు లేకుండా అన్ని సబ్జెక్టులపై చర్చిస్తున్నారు.. ప్రశ్నలు సంధిస్తున్నారు.. సమాధానాలు ఇస్తున్నారు.. మేడ్చల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆన్లైన్ అధ్యయనంలో దూసుకుపోతున్నారు. కాగ్నిజెంట్ సంస్థ సహకారంతో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు చేపట్టిన ఆన్లైన్ బోధన అద్భుత ఫలితాలు ఇస్తున్నది. లాక్డౌన్ కారణంగా పదోతరగతి పరీక్షలు మధ్యలోనే ఆగిపోవటం.. పాఠశాలలు మూతపడటంతో పదోతరగతి విద్యార్థులు నష్టపోకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు వినూత్న ప్రయోగం చేశారు. కాగ్నిజెంట్ కంపెనీ సౌజన్యంతో జిల్లాలోని ప్రభుత్వ టీచర్లకు జూమ్యాప్ ద్వారా ఆన్లైన్ బోధనలో శిక్షణ ఇచ్చారు.
విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు అందజేసి, శిక్షణ పొందిన టీచర్ల ద్వారా 40 రోజులపాటు ఆన్లైన్ పాఠాలు బోధించారు. ఈ విధానానికి అలవాటు పడిన తర్వాత విద్యార్థులు తాము నేర్చుకున్న పాఠాలను బోధిస్తూ వీడియోలు తీసి పంపాలని సూచించారు. అందుకోసం 80 నుంచి 100 మంది విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేశారు. దాంతో విద్యార్థుల టీచర్ల మార్గదర్శనంలో వివిధ పాఠ్యాంశాలను ఎలాంటి బెరుకు లేకుండా బోధిస్తూ దానినంతటినీ వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు.