విశాఖ ఘటనపై ప్రముఖుల దిగ్భ్రాంతి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 07, 2020

విశాఖ ఘటనపై ప్రముఖుల దిగ్భ్రాంతి


శుభ తెలంగాణ (07, మే,2020 - ఆంధ్రప్రదేశ్) : విశాఖ పరిధిలోని ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలో ఎల్‌జీ పాలీమర్స్‌ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకేజీ దుర్ఘటనపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనపై ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తదితరులు ట్విటర్‌ ద్వారా స్పందించారు. విశాఖ ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో మాట్లాడిన ప్రధాని మోదీ...  అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

‘విశాఖలో గ్యాస్‌ లీకేజీ ఘటనకు సంబంధించి ప్రస్తుత పరిస్థితిపై హోం శాఖ, విపత్తు నిర్వహణ విభాగం అధికారులతో మాట్లాడా. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నా. విశాఖలోని ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

‘విశాఖ ఘటన మనసును కలచివేసింది. ఘటనపై విపత్తు నిర్వహణ విభాగం అధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నాను. మొత్తం వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా. బాధితులంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’:  అమిత్‌ షా

విశాఖ ఘటనపై ప్రముఖుల దిగ్ర్భాంతి :

‘విశాఖ పాలీమర్‌ పరిశ్రమ దుర్ఘటన బాధాకరం. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సహాక చర్యలు చేపట్టాయి. బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’: నిర్మలా సీతారామన్‌.

‘విశాఖ ఘటన బాధాకరం. సమీపంలోని కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలు పూర్తి తోడ్పాటును అందించాలి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలి’: రాహుల్‌ గాంధీ

‘ విశాఖ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యాను. ఆత్మీయులను కోల్పోయిన వారికి నా  సానుభూతి. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ఈ ఏడాది చాలా భయంకరంగా ఉంది’: కేటీఆర్‌

‘విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది ఒక దురదృష్టకర సంఘటన. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు.

Post Top Ad