హైకోర్టు సీరియస్:చనిపోయిన వారి మృతదేహాలకు ఎందుకు కరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, May 27, 2020

హైకోర్టు సీరియస్:చనిపోయిన వారి మృతదేహాలకు ఎందుకు కరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు

తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాలకు ఎందుకు కరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు అని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మృతదేహాలకు పరీక్షలు చేయాలని, టెస్టులు అవసరం లేదనే ఉత్తర్వులను కొట్టివేసింది. జనాభాకు సరిపడ పరీక్షలు చేయకుండా వైరస్ వ్యాప్తికి ప్రభుత్వమే కారణమవుతోందని మండిపడింది. కరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదని, వలస కార్మికులకు సరైన వసతి కల్పించడం లేదని దాఖలైన ఐదు పిటిషన్లపై మంగళవారం ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.
రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షలు జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మిగతా రాష్ట్రాల కన్నా ఎందుకు తక్కువగా టెస్టులు చేస్తున్నారని ప్రశ్నించింది. మిలియన్ జనాభాకు కేవలం 545 కరోనా టెస్టులు మాత్రమే చేశారని అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రానికి తిరిగి వస్తున్న వలస కార్మికులకు ఇప్పటి వరకు ఎన్ని టెస్ట్‌లు చేశారని హైకోర్టు ప్రశ్నించగా.. ఇప్పటివరకు 24వేల 443 మందికి పరీక్షలు నిర్వహించామని అడ్వకేట్ జనరల్ వివరించారు. ఏజీ వాదనలతో హైకోర్టు ఏకభవించలేదు.
ఎంత మంది ప్రైమరీ,సెకండరీ కాంటాక్ట్‌లకు టెస్ట్‌లు నిర్వహించారో జూన్ 4వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా పరీక్షల నిర్వహణపై రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2 సార్లు లేఖలు రాసిందని, దానిపై పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని కోరింది. హై రిస్క్ అవకాశాలు ఉన్నవారికి ఎందుకు పరీక్షలు చేయడం లేదు అని అడిగింది. పొరుగురాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలో ఎంతమందికి పరీక్షలు చేశారని నిలదీసింది. ఎన్ని ఆస్పత్రుల్లో పీపీఈ కిట్లు ఎంతమంది వైద్య సిబ్బందికి అందజేశారో తెలియజేయాలని కోరింది.