తెలంగాణ అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది.. బతుకమ్మ, బిర్యానీ, బోనాలు..సంప్రదాయాలు. రాష్ట్రంలో ఎక్కువగా పండే పంటలు వరి, మొక్క జొన్న, మిర్చి..ఇతర పంటలు. కానీ ఇప్పుడు మరో పంట కూడా తెరమీదకు వచ్చేసింది. చల్లని వాతావరణంలో పండే ‘ఆపిల్’ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా సాగు చేస్తున్నారు.
త్వరలోనే ఈ పండ్లు మార్కెట్ లోకి రానున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తెలంగాణ యాపిల్ పండ్లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ధనోరాలో... బాలాజీ అనే రైతు యాపిల్ తోటను సాగు చేశారు. యాపిల్ పండ్లు చేతికొచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ను ఇస్తానని హామీ ఇచ్చారు.
ఈ మేరకు 2020, మే 25వ తేదీ సోమవారం తన తోటలోని యాపిల్ పండ్లను కోయబోతున్నారు. మొదటిసారిగా కాసిన యాపిల్ పండ్లను 2020, మే 26వ తేదీ మంగళవారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్కు అందించనున్నాడు. యాపిల్ పండ్లతో పాటు ఓ మొక్కను కూడా సీఎం కేసీఆర్ కు బహూకరించనున్నాడు.
ఇక్కడ CCMB శాస్త్రవేత్తలు తమ వంతు ప్రోత్సాహం అందించారు. 2014 సంవత్సరంలో భూమిలో సాగుకు అనుకూలమైన హరిమన్ రకానికి చెందిన 150 మొక్కలను బాలాజీకి ఇచ్చారు. 2016లో వ్యవసాయ శాఖ మరో 300 మొక్కలు ఇచ్చారు. వీటిని నాటి..మూడు సంవత్సరాల కాసిన కాయలను కోయకుండా అలాగే చెట్టకు వదిలేశాడు. ప్రస్తుతం ఒక్కో కాయ 250 గ్రాములకు చేరినట్లు తెలుస్తోంది. కాశ్మీర్ యాపిల్ ను తలపిస్తోంది.