ఎనుమాముల మార్కెట్‌యార్డ్‌లో క్రయ, విక్రయాలు తిరిగి ప్రారంభమయ్యాయి. లాక్డౌన్ నేపథ్యంలో వరంగల్ అర్భన్ జిల్లా ఎనుమాముల మార్కెట్‌యార్డ్‌లో నిలిచిపోయిన క్రయ విక్రయాలను 65 రోజుల తర్వాత బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో మంత్రి సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయించారు. రైతులకు మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... ఎనుమాముల మార్కెట్ దేశంలోనే అతి పెద్ద మార్కెట్ అన్నారు. రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించే మార్కెట్ అన్నారు. మేలు రకం మిర్చికి సరైన ధర రాలేదని రైతులు భావిస్తే కోల్డ్ స్టోరేజీలో పెట్టుకుంటే మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునే వెసులుబాటు ఉంటుందన్నారు. అదేవిధంగా పంట విలువలో వడ్డీ లేకుండా 75 శాతం అప్పుగా తీసుకునే అవకాశం ఉందన్నారు. వ్యాపారులు కేవలం లాభాపేక్షే కాకుండా కాస్త సేవా థృక్పందంతో వ్యవహరించాలన్నారు. రైతులకు అన్యాయం జరగకుండా కొనుగోళ్లు చేయాలన్నారు.
రైతుకు ఎవరో న్యాయం చేయాల్సిన పనిలేదు...
ప్రభుత్వం సూచించిన పంటలు వేస్తే రైతుకు ఎవరో న్యాయం చేయాల్సిన పనిలేదన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన పంటలు వేస్తే రైతులు లాభాల బాట పడతారన్నారు. కూరగాయలు, పూలు ఇతర రాష్ర్టాల నుంచి తెప్పించుకుంటున్నాం. ఈ రకమైన పంటలు రైతులు వేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలో మహబూబాబాద్, వరంగల్ అర్బన్, జనగాంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సెజ్‌లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మేయర్ గుండా ప్రకాష్, మార్కెట్ కమిటీ చైర్మన్ సదానందం, వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.