తెలంగాణకు మిడతల ముప్పుపై కేసీఆర్ సమీక్ష.. ఈ జిల్లాలకు మరింత నష్టం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 28, 2020

తెలంగాణకు మిడతల ముప్పుపై కేసీఆర్ సమీక్ష.. ఈ జిల్లాలకు మరింత నష్టం

మహారాష్ట్ర మీదుగా తెలంగాణ వైపునకు మిడతల దండు దూసుకొస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అప్రమత్తమైంది. మిడతల దండు వస్తే ముందస్తు నష్ట నివారణ చర్యలు ఎలా చేపట్టాలన్న అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒకవేళ మిడతల దండు రాష్ర్టానికి వస్తే చేపట్టాల్సిన చర్యలపై సీఎం అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి అధికారులు, శాస్ర్తవేత్తలు, పలువురు నిపుణులు హాజరయ్యారు.

మిడతల దండు కొద్ది రోజులుగా ఉత్తర, పశ్చిమ భారతానికే పరిమితమైంది. తొలుత పాకిస్థాన్ నుంచి రాజస్థాన్‌కు, హరియాణా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో మిడతలు వేలాది ఎకరాల్లో పంటను నాశనం చేశాయి. మధ్యప్రదేశ్ నుంచి ఇప్పుడు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో తమ ప్రతాపాన్ని చూపిస్తు్న్నాయి. బుధవారం నాటికి మహారాష్ట్రలోని అమరావతి వరకు ఈ మిడతలు చేరుకున్నాయి. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఎగురుతూ వాటి దారిలో కనిపించే ప్రతీ చెట్టూ, తినేసే ఈ మిడతలను మహారాష్ట్ర ప్రభుత్వం నియంత్రించలేకపోతే మరో రెండు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని అంచనా. 17 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక మిడతల గుంపు మహారాష్ట్రలోని అమరావతి సమీపంలో ఉంది.

మహారాష్ట్రతో తెలంగాణలోని నిజామాబాద్‌, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలు సరిహద్దు పంచుకుంటున్నాయి. ఈ ప్రాంతాలకే మిడతల నుంచి ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. మిడతల దండును గుర్తిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఈ సమస్యపై బుధవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సరిహద్దు జిల్లాల కలెక్టర్లను సైతం ఇప్పటికే అప్రమత్తం చేశారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో నిఘాబృందాలు, గ్రామ కమిటీలను ఏర్పాటుచేసి మిడతల దండుతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు.