గుడ్ న్యూస్ : భారీగా తగ్గినా LPG గ్యాస్ సిలిండర్ ధరలు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 02, 2020

గుడ్ న్యూస్ : భారీగా తగ్గినా LPG గ్యాస్ సిలిండర్ ధరలు


శుభ తెలంగాణ (02. మే , 2020 - జాతీయం) : దేశంలో వంటగ్యాస్‌ ధరలు మరోసారి భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా బెంచ్‌మార్క్‌ రేట్ల తగ్గుదలకు అనుగుణంగా గృహ అవసరాలకు వినియోగించే సబ్సిడీయేతర వంటగ్యాస్‌ సిలిండర్‌ (14.2 కిలోల) ధరను రూ. 162.50 వరకు, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ.1,285 నుంచి రూ.1,029.50కు తగ్గిస్తున్నట్టు ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ సంస్థ లు వెల్లడించాయి. దీంతో సబ్సిడీయేతర గ్యాస్‌ సిలిండర్‌ ధరలు వరుసగా మూడో నెలలోనూ తగ్గాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు దేశాలు లాక్‌డౌన్లు విధించడంతో ముడిచమురుకు డిమాండ్‌ తగ్గి అంతర్జాతీయంగా ధరలు పతనమవడమే ఇందుకు కారణం. ఢిల్లీలో గురువారం వరకు రూ.744గా ఉన్న 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర తాజా తగ్గింపుతో రూ.581.50కు చేరింది. హైదరాబాద్‌లో ఈ ధర ఏకంగా రూ.207 తగ్గి రూ. 589.50కు చేరింది. ఇటీవలి కాలంలో సబ్సిడీయేతర వంటగ్యాస్‌ ధర ఇంత భారీగా తగ్గడం ఇదే తొలిసారి.గతేడాది జనవరిలో ఈ ధర రూ.150.50 తగ్గింది. సబ్సిడీయేతర గ్యాస్‌ సిలిండర్‌ ధరను ఈ ఏడాది మార్చిలో రూ.53, ఏప్రిల్‌లో రూ.61.50 చొప్పున తగ్గించిన చమురు మార్కెటింగ్‌ సంస్థలు ఇప్పుడు తాజాగా మరో రూ.162.50 తగ్గించాయి. దీంతో గత మూడు నెలల వ్యవధిలో ఒక్కో సిలిండర్‌ ధర మొత్తంమీద రూ.277 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన సగటు ధరతోపాటు విదేశీ మారక రేటును ఆధారంగా ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు ప్రతినెలా 1వ తేదీన వంటగ్యాస్‌ ధరలను సవరిస్తున్నాయి.