ఉస్మానియా మెడికల్ కాలేజీలో కలకలం: 12 మంది పీజీ విద్యార్థులకు కరోనా పాజిటివ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 02, 2020

ఉస్మానియా మెడికల్ కాలేజీలో కలకలం: 12 మంది పీజీ విద్యార్థులకు కరోనా పాజిటివ్

కరోనావైరస్‌ తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఉస్మానియా మెడికల్ కాలేజీలో విద్యార్థులకు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో అక్కడి విద్యార్థులు ఇతర సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక విద్యార్థులకు కరోనావైరస్ పాజిటివ్ తేలడంతో మెడికల్ కాలేజీ క్యాంపస్ బోసిపోయింది. విద్యార్థులు ఎవరూ కనిపించడం లేదు. బయటకు రావడం లేదు.
ఉస్మానియా మెడికల్ కాలేజీలో 12 మంది పీజీ విద్యార్థులకు కరోనావైరస్ పాజిటివ్ తేలడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే రీడింగ్ రూమ్‌ను మూసివేసిన పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. అయితే విద్యార్థులకు కరోనావైరస్ పాజిటివ్ తేలడంతో ఇతర విద్యార్థుల్లో ఆందోళన కనిపిస్తోంది. విద్యార్థులంతా భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు. వాస్తవానికి జూన్ 20 నుంచి పీజీ విద్యార్థులకు పరీక్షలు ఉన్న నేపథ్యంలో వారంతా ప్రిపేర్ అవుతున్నారు. రీడింగ్ రూంలలో కూర్చొని పరీక్షలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో కరోనావైరస్ విద్యార్థులకు సోకడం ఇప్పుడు తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
ముఖ్యంగా హాస్టల్‌లో ఉన్న విద్యార్థులు భయ పడుతున్నారు. గర్ల్స్ మరియు బాయ్స్ హాస్టల్‌లో కలిపి మొత్తం 280 మంది విద్యార్థులున్నారు. ఇక కరోనావైరస్ క్యాంపస్‌లోని విద్యార్థులపై పంజా విసరడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. అన్ని జాగ్రత్త చర్యలు పాటించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ పీపీఈ కిట్లు వినియోగించాలని మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ ఆదేశించారు. ముందుగా ఒక విద్యార్థికి కరోనా పాజిటివ్ తేలడంతో అతనితో పాటు ఉన్న ఇతర విద్యార్థులకు సైతం టెస్టులు నిర్వహించగా వారిలో 11 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇక ఉస్మానియా హాస్టల్‌లో ఉన్న మొత్తం విద్యార్థులకు కరోనావైరస్ టెస్టులు నిర్వహించినట్లు చెప్పిన యాజమాన్యం వీరి రిపోర్టులు బుధవారంకు వస్తాయని వెల్లడించింది.