తెలంగాణలో కొత్తగా 143 కరోనా కేసులు.. 8 మరణాలు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, June 06, 2020

తెలంగాణలో కొత్తగా 143 కరోనా కేసులు.. 8 మరణాలు..

తెలంగాణలో శుక్రవారం కొత్తగా 143 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 8 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 3290కి చేరింది. వీరిలో 448 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు ఉన్నారు. ఇప్పటివరకూ మొత్తం మృతుల సంఖ్య 113కి చేరింది. ఇప్పటివరకూ 1627 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అవగా.. ప్రస్తుతం 1550 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
శుక్రవారం నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 116 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 8, మహబూబ్ నగర్‌లో 5, వరంగల్‌లో 3, ఖమ్మం, ఆదిలాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, కరీంనగర్‌లో రెండు కేసుల చొప్పున, మంచిర్యాలలో ఒక కేసు నమోదయ్యాయి. ఇప్పటివరకూ విదేశాల నుంచి వచ్చిన 212 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని,అలాగే 206 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌గా తేలిందని... వీరందరికీ ప్రస్తుతం చికిత్స అందుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలంగాణలో వైద్య సిబ్బందికి కరోనా సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అంతకుముందు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఇందుకోసం కరోనా ఆసుపత్రుల్లో రెండంచెల విధానాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. పీపీఈ కిట్లు తగిన సంఖ్యలో లేకపోవడం వల్లే వైద్యులకు కరోనా సోకిందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. రాష్ట్రంలో 10 లక్షల పీపీఈ కిట్లు ఉన్నాయని,మాస్కులు,మందులకు కూడా కొరత లేదని స్పష్టం చేశారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం.. కరోనా లక్షణాలు, హై రిస్క్‌ ఉన్నవారికే టెస్టులు చేస్తున్నామన్నారు.