పట్టణాల అభివృద్ధికి నెలకు రూ.148 కోట్లు విడుదల - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, June 02, 2020

పట్టణాల అభివృద్ధికి నెలకు రూ.148 కోట్లు విడుదల

‘పల్లె ప్రగతి’ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమాన్ని చేపట్టింది. పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం హైదరాబాద్‌ మినహా అన్ని 12 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీలలో గత ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. పట్టణాల అభివృద్ధికి ప్రతి నెల రూ.148 కోట్ల చొప్పున ఆర్థిక సంఘం నిధులను విడుదలచేస్తున్నది. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డులవారీగా ఆయా పట్టణాల అవసరాల ప్రాతిపదికన వార్షిక/ పంచవర్ష ప్రణాళికలను తయారుచేశారు. హరిత ప్రణాళికలో భాగంగా ఏ వార్డులో ఎన్ని మొక్కలు నాటాలో నిర్ధారించుకొన్నారు. ఖాళీ స్థలాలు, పార్కులు, నీటి వసతులున్న ప్రాంతాల్లో నర్సరీలు ఏర్పాటుచేశారు. చిన్నచిన్న మున్సిపాలిటీల్లో నర్సరీల ఏర్పాటు సాధ్యం కాని చోట జిల్లా కలెక్టర్ల సారథ్యంలో ఉపాధి హామీ పథకం కింద సంబంధిత మున్సిపాలిటీల సమీపంలో ఉన్న పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటుచేశారు. మొక్కల పెంపకానికి అనువైన ఇండ్లు, వీధులు, బ్లాకులు, కార్యాలయాలు, ఖాళీ స్థలాలను గుర్తించారు. వార్డుల్లో ఉండే పొదలను, శిథిలాలను, చెత్తాచెదారం తొలిగించారు. వంగిన, తుప్పు పట్టిన విద్యుత్‌ స్తంభాలను తొలిగించి కొత్తవి ఏర్పాటుచేశారు. ట్రాన్స్‌ఫార్మర్ల రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టారు. పార్కులు, మరుగుదొడ్లు, కూడళ్లలో వీధిదీపాల ఏర్పాటుపై ఓ అంచనాకు వచ్చారు. విద్యుత్‌శాఖ సహకారంతో మూడో కరెంటు తీగను ఏర్పాటుచేశారు. ఇండ్లపైనుంచి వెళ్తున్న కరెంటు తీగలను గుర్తించి విద్యుత్‌శాఖరు నివేదిక సమర్పించారు. శ్మశానవాటికలు, సమీకృత మార్కెట్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను గుర్తించారు. పార్కులు, క్రీడాస్థలాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. డంపింగ్‌ యార్డులు, మురుగునీటి శుద్ధి కర్మాగారాల ఏర్పాటుకు స్థలాలను గుర్తించి, భూసేకరణ చేశారు. ఆటోలు, రిక్షా స్టాండ్లు, వీధి మార్కెట్లకు అవసరమైన ఏర్పాట్లుచేశారు.