15 లేదా 16న దోస్త్‌ షెడ్యూల్‌ ! సెప్టెంబర్‌ 1 నుంచి డిగ్రీ తరగతులు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, June 12, 2020

15 లేదా 16న దోస్త్‌ షెడ్యూల్‌ ! సెప్టెంబర్‌ 1 నుంచి డిగ్రీ తరగతులు

రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 15 లేదా 16వ తేదీన షెడ్యూల్‌ విడుదల కానున్నది. ఈ మేరకు డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌-2020) అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ ఫలితాలు ఈ నెల 15న విడుదల కానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా షెడ్యూల్‌ రూపొందిస్తున్నారు. 2020-21 విద్యాసంవత్సరానికి జూలై, ఆగస్టులో రెండు లేదా మూడుదశల్లో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టి ఆగస్టు 24 వరకు పూర్తిచేయనున్నారు. 
యూజీసీ మార్గదర్శకాల ప్రకారం మొదటి సంవత్సరం తరగతులను సెప్టెంబర్‌ ఒకటి నుంచి, ద్వితీయ, తృతీయ సంవత్సరం తరగతులను ఆగస్టు ఒకటినుంచి నిర్వహించాల్సి ఉన్నది. ఈ మేరకు షెడ్యూల్‌ సిద్ధంచేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్ల నిర్వహణకు సీజీజీ సహకారం అందిస్తున్నది. విద్యార్థులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడం కోసం వాట్సాప్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించనున్నారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో కాలేజీలను ఎప్పటినుంచి ప్రారంభించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తుదినిర్ణయం ప్రకటించనున్నది.

Post Top Ad